అమెరికాలో అల్-ఖైదా ఉగ్రవాదులు(Al Qaeda Attacks) జరిపిన మారణహోమానికి(9/11 Attack) నేటితో 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఆనాటి విధ్వంస కాండలో (9/11 memorial) ప్రాణాలు కోల్పోయిన 2,997 మంది త్యాగాలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్మరించుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. అతి దుర్బలమైన సమయంలోనూ సమైక్య శక్తి గొప్పతనాన్ని ఈ విషాద ఘటన తెలియజేందని పేర్కొన్నారు.
"2001, సెప్టెంబర్ 11న న్యూయార్క్, అర్లింగ్టన్, వర్జీనియా, షాంక్స్విల్లే, పెన్సిల్వేనియాలో జరిగిన ఉగ్రదాడిలో దాడిలో 90 దేశాలకు చెందిన 2,997 మంది ప్రాణాలు విడిచారు. మరో 1000 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. వారందరిని, వారి కుంటుబాలను అమెరికా స్మరించుకుంటోంది."
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు.
9/11 దాడుల సమయంలో అండగా నిలిచి, సహాయక చర్యలు అందించిన బలగాల సేవలను బైడెన్(Joe Biden) కొనియాడారు. "పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు, భవన నిర్మాణ కార్మికులు, వైద్యులు, నర్సులు, నాయకులు, సేవా సంఘాల సభ్యులు, సహా సహాయక చర్యల్లో పాల్గొని, అమెరికాను కోలుకునేలా చేసి, పునర్నిర్మాణంలో సహకరించిన వారందరినీ అమెరికా ఎంతో గౌరవిస్తోంది" అని బైడెన్ పేర్కొన్నారు.
బైడెన్, జిల్ బైడెన్ పర్యటన..
అంతకుముందు.. 9/11 దాడిలో మృతి చెందిన వారికి నివాళి అర్పించేందుకు అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్.. న్యూయార్క్, పెన్సిల్వేనియా, వర్జీనియా వెళ్లనున్నారని శ్వేతసౌధం తెలిపింది. అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదంపై 20 ఏళ్ల పోరాటం ముగించి, సైన్యాన్ని ఉపసంహరించిన తర్వాత వీరి పర్యటన జరగనుండటం గమనార్హం.
2001 సెప్టెంబర్ 11న ఉగ్ర సంస్థ అల్-ఖైదా జరిపిన దాడి యావత్ ప్రపంచాన్ని నిశ్చేష్టుల్ని చేసింది. రెండు విమానాలను హైజాక్ చేసిన ఉగ్రవాదులు అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్(డబ్ల్యూటీసీ) టవర్లను ఢీ కొట్టారు. 102 నిమిషాల్లో ఉగ్రవాదులు జరిపిన ఈ బీభత్సంలో దాదాపు 3వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తర్వాతే అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్(Osama Bin Laden) కోసం వేట సహా ఉగ్రవాదంపై పోరాటానికి అఫ్గానిస్థాన్‌లో సైన్యాన్ని మోహరించింది.
ఇదీ చూడండి: 9/11 Attack: విధ్వంస కాండకు 20 ఏళ్లు.. ఇంకా మానని గాయాలు