అమెరికా చరిత్రలో దిగమింగలేని ఓ చేదు నిజం.. అధ్యక్షులు తమ ఆరోగ్యంపై అబద్దాలు చెప్పడం. కొన్నిసార్లు సమస్య చిన్నది కావచ్చు, మరికొన్ని సార్లు అత్యంత భయంకరమైనదీ కావచ్చు. అసలు విషయం మాత్రం నిగూఢంగానే ఉంటూ వచ్చింది. శ్వేతసౌధ అంతరంగంలో దాగి ఉన్న నిజం.. ప్రజలకు తెలిసేందుకు దశాబ్దాల సమయం పట్టిన దాఖలాలు ఉన్నాయి.
తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడ్డట్లు తేలింది. అధ్యక్షుడికి 'స్వల్ప లక్షణాలు' ఉన్నాయని శ్వేతసౌధం తన ప్రకటనలో తెలిపింది. కానీ శుక్రవారం సాయంత్రానికి ఆయన వాల్టర్ రీడ్ సైనిక ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. అధ్యక్షుడి వైద్యులు కొన్ని మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పినప్పటికీ.. శ్వేతసౌధం మాత్రం అరకొర పదాలతో అస్పష్టమైన ప్రకటనే ఇచ్చింది.
ఉడ్రో-ట్రంప్ ఒకేలా!
ట్రంప్‌తో పాటు మాజీ అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ హయాంలోనూ మహమ్మారి ప్రభావం చూపింది. విల్సన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్పానిష్ ఫ్లూ హడలెత్తించింది. వేల మంది అమెరికన్లను పొట్టనబెట్టుకుంది. దీన్ని విల్సన్ పెద్దగా పట్టించుకోలేదు. ఇలా.. వైరస్‌లను ఇద్దరు అధ్యక్షులు తక్కువ చేసి చూపించారు. యాదృచ్ఛికంగా ఇద్దరూ వైరస్ బారిన పడ్డారు. ఇక్కడ మరో విషయమేంటంటే ఇరువురు కూడా ఈ విషయాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పలేదు.
ఎప్పటి నుంచో కొనసాగుతున్న సంప్రదాయాన్ని పాటిస్తూనే విల్సన్ అస్వస్థత విషయాన్ని శ్వేతసౌధం దాచిపెట్టింది. మొదటి ప్రపంచయుద్ధం ముగిసిన తర్వాత పారిస్‌లో శాంతి చర్చల సందర్భంగా 1919 ఏప్రిల్‌లో ఫ్లూ సోకింది. ఈ విషయాన్ని వైట్‌హౌస్ రహస్యంగా ఉంచింది. అకస్మాత్తుగా ఆయనలో తీవ్ర లక్షణాలు బయటపడ్డాయి. విల్సన్‌పై విషప్రయోగం జరిగిందేమోనని వ్యక్తిగత వైద్యుడు కేరీ గ్రేసన్కు అనుమానం వచ్చింది. రాత్రంతా విల్సన్ బాగోగులు చూసుకున్న తర్వాత ఉదయం వైట్‌హౌస్‌కు లేఖ రాశారు కేరీ. అధ్యక్షుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని సమాచారం అందించారు.
ఈ కథను వందేళ్లు ఫాస్ట్ ఫార్వర్డ్ వస్తే.... శుక్రవారం(అక్టోబర్ 2న) తనతో పాటు ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కొవిడ్ బారిన పడ్డట్లు అధ్యక్షుడు ప్రకటించారు. అర్ధరాత్రి 12:54 గంటల సమయంలో ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించారు. కానీ శ్వేతసౌధం మాత్రం ట్రంప్ ఆరోగ్యంపై కొద్దిపాటి సమాచారమే ఇచ్చింది. ఆయనను చాలా జాగ్రత్తగా వాల్టర్ రీడ్ ఆస్పత్రికి తరలించినట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కెయిలీ మెక్ఎనానీ పేర్కొన్నారు. కొవిడ్‌పై పోరులో అమెరికా బలంగా పుంజుకుందని ప్రచారంలో చెప్పుకుంటున్న ట్రంప్‌కు ఇదొక కీలక మలుపు.
వైరస్ పట్ల నిర్లక్ష్యంపై
ట్రంప్ మొదటి నుంచీ వైరస్‌ను తక్కువ చేసి చూపించారు. కరోనా ప్రబలిన తొలినాళ్లలో ఆకస్మిక చర్యలేవీ పెద్దగా చేపట్టలేదు. ప్రజల్లో భయాందోళనలు పెంచకుండా ఉండేందుకే మహమ్మారిని తక్కువ చేసినట్టు ట్రంప్ చెప్పారు. కానీ దీనికి వేరే రాజకీయ కారణాలు ఉన్నాయి. మొదటి విడత పాలనా కాలాన్ని ముగించుకోబోతున్న ట్రంప్.. మరోసారి ఎన్నికవ్వాలని ఊవిళ్లూరుతున్నారు. కాబట్టి నవంబర్ 3న జరిగే ఎన్నికలకు ముందు అమెరికా ఆర్థిక వ్యవస్థ కుంగిపోకూడదని అనుకున్నారు.
అయితే ఉడ్రో విల్సన్ యంత్రాంగం స్పానిష్ ఫ్లూను నిర్లక్ష్యం చేయడానికి కారణాలు మాత్రం పూర్తిగా భిన్నం. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఆయన తన దృష్టిని వేరే అంశాలపై ఉంచేందుకు ఇష్టపడలేదు. 'ఇతర విషయాలపై దృష్టిపెడితే యుద్ధ సన్నద్ధతపై దాని ప్రభావం పడుతుందని, అంతేకాకుండా యుద్ధంలో విజయం సాధించడంపై ప్రజల్లో అపోహలు తలెత్తుతాయని ఆయన భావించారు' అని షికాగో యూనివర్సిటీ ఆచార్యులు విలియం హొవెల్ జాన్ బారీ పేర్కొన్నారు. ఈ విషయంలో పూర్తిగా రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయని అన్నారు హొవెల్. ఈ నేపథ్యంలో ట్రంప్ విషయంలో శ్వేతసౌధం పారదర్శకతపై అనుమానాలు వ్యక్తం చేశారు.
చరిత్రలో ఎంతో మంది అధ్యక్షులు..
వీరిద్దరే కాకుండా తమ అనారోగ్యంపై, వైద్య స్థితిగతులపై వివరాలను చాలా మంది అధ్యక్షులు ప్రజలకు తెలియనీయలేదు. చరిత్రను తరచి చూస్తే వీటికి అనేక ఉదాహరణలు లభిస్తాయి.
- అమెరికా మాజీ అధ్యక్షుడు గ్రూవర్ క్లీవ్‌లాండ్ ఒకప్పుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తన అనారోగ్యం రాజకీయ బలహీనతగా మారుతుందేమోనని భయపడి.. రహస్యంగా శస్త్రచికిత్స చేయించుకున్నారు. లాంగ్ ఐలాండ్‌లోని ఓ ప్రైవేటు నౌకలో అర్ధరాత్రి సమయంలో చికిత్స చేయించారు. ఆయన నోట్లో నుంచి తీసిన క్యాన్సర్ కణతిని ఫిలడెల్ఫియాకు చెంది కళాశాల వైద్యులు 2000లో ప్రదర్శనకు పెట్టారు.
- అమెరికా 36వ అధ్యక్షుడు లిండన్ బీ జాన్సన్ తన చేతిపై ఏర్పడిన పుండును తొలగించేందుకు 1967లో రహస్యంగా శస్త్రచికిత్స చేయించుకున్నారు.
- యుద్ధం సహా ఇతర విపత్కర పరిస్థితుల్లో అమెరికాను నడిపించిన ఫ్రాంక్లిన్ డీ రూజ్వెల్ట్ 1944 తొలినాళ్లలో అనారోగ్యానికి గురయ్యారు. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, గుండె వైఫల్యాలు, ధమనులు గట్టిపడటం, తీవ్రమైన శ్వాసనాళాల వాపు వంటి సమస్యలతో బాధపడ్డారు. ధూమపానం తగ్గించి, ఉప్పు తక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నాయనే కారణంతో అధ్యక్షుడి ఆరోగ్యానికి ఎలాంటి హాని లేదని శ్వేతసౌధం సిబ్బంది ప్రకటన జారీ చేశారు. చివరకు 1945 ఏప్రిల్ 12న తుదిశ్వాస విడిచారు ఫ్రాంక్లిన్.
ఇదీ చదవండి- ట్రంప్ ఆరోగ్యం ఆందోళనకరం! రాబోయే 48 గంటలు కీలకం