కరోనా చికిత్స కోసం భారత్ నుంచి భారీగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ కొనుగోలు చేశామని, ఆ సరకులో చాలా వరకు తమ దేశానికి చేరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ గొప్పవారని.. అడిగినవెంటనే సాయం చేశారని ప్రశంసించారు.
"2.9 కోట్ల డోసులకుపైగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను కొనుగోలు చేశాం. నేను దీనిపై ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడాను. భారత్‌లో ఈ మందులు భారీగా తయారవుతున్నాయి. మీరు వీటిని మాకు పంపుతారా అని అడిగా. ఆయన గొప్పవారు. నిజంగా చాలా మంచివారు. "
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
అంతర్జాతీయంగా డిమాండ్..
కరోనా వైరస్ బాధితులకు చికిత్స చేసేందుకు మలేరియా డ్రగ్ అయిన హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఐసీఎంఆర్ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. అయితే స్థానిక అవసరాల కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతులపై భారత్ ఇటీవల నిషేధం విధించింది.
మోదీకి ఫోన్..
హైడ్రాక్సీక్లోరోక్విన్ గురించి ప్రతిసారి చాలా గొప్పగా చెబుతూ వస్తున్నారు ట్రంప్. మోదీకి గతవారం ఫోన్ చేసి ఆ ఔషధం ఎగుమతిపై నిషేధం ఎత్తివేయాలని కోరారు. మరుసటి రోజు... ఈ విషయంలో భారత్ నిర్ణయం తీసుకోకపోతే ప్రతీకార చర్యలు ఉంటాయని పరోక్షంగా హెచ్చరించారు.
మిత్రపక్షాల అవసరాల దృష్ట్యా హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతులపై మంగళవారం ఆంక్షలు సడలించింది భారత్.
ఇదీ చూడండి: ఆ ఔషధం ఎగుమతులపై నిషేధం పాక్షికంగా ఎత్తివేత