అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇంకా అంగీకరించట్లేదు. తానే అధ్యక్షుడినని ఫలితాలు వెలువడక ముందే ప్రకటించుకున్న ట్రంప్.. ఇప్పటికీ పరాజయాన్ని ఒప్పుకోవట్లేదు. ఫలితాలను మార్చేందుకు బైడెన్ అవినీతికి పాల్పడినట్లు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ట్రంప్ ఓటమిని ఒప్పుకోకపోవడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రత్యర్థులే కాకుండా సొంత పార్టీలోనూ ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులు ట్రంప్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా ఆయన సతీమణి కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది. ఓటమిని అంగీకరించమని ఆమె కోరినట్లు సమాచారం. అమెరికా ప్రథమ మహిళ మెలానియా గతనెలలో తన భర్త కోసం ఎన్నికల ప్రచారాల్లోనూ పాల్గొన్నారు.
అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా పెన్సిల్వేనియా, నెవాడాలో వచ్చిన ఫలితాలతో.. మ్యాజిక్ మార్క్ అందుకున్న జో బైడెన్ ఘనవిజయం సాధించారు. 290 ఎలక్టోరల్ ఓట్లతో అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్ల దగ్గరే నిలిచిపోయారు. ఫలితంగా రెండోసారి వైట్‌హౌస్‌లో అడుగుపెట్టాలన్న ట్రంప్ ఆశలు ఆవిరయ్యాయి.