కరోనా వైరస్‌తో చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊవిళ్లూరుతున్నారు. అగ్రరాజ్యంలో ఆర్థిక కార్యకలాపాలకు అనుమతులిచ్చిన రాష్ట్రాలపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే.. ఇంకా లాక్డౌన్ నిబంధనలను పాటిస్తున్న ప్రభుత్వాలపై విమర్శనాస్త్రాలు సంధించారు.
ఆదివారం ఓ ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు ట్రంప్. లాక్డౌన్ ఎత్తివేతపై ప్రజల సందేహాలకు సమాధానమిచ్చారు.
దేశంలో ఆర్థిక కార్యకలాపాలను తక్షణమే పునరుద్ధరించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు ట్రంప్. అయితే కొందరు ఉద్యోగాలకు తిరిగి వెళ్లాలనుకుంటుంటే.. మరికొందరు మాత్రం వైరస్ సోకుతుందమోనన్న భయంతో ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఈ దూకుడు ఎందుకు?
ప్రపంచంలో ఎక్కడా లేనన్ని కేసులు, మరణాలు అగ్రరాజ్యంలోనే నమోదయ్యాయి. కరోనా వైరస్‌పై తన వైఖరి, పరీక్షల నిర్వహణలో లోపాల వల్ల ట్రంప్‌పై అనేక విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడిగా మరోమారు ఎన్నికవ్వాలంటే ట్రంప్‌కు ఆర్థిక వ్యవస్థ అస్త్రం ఎంతో ముఖ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ప్రకటించారు ట్రంప్.
సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి రాష్ట్రాలు కావాల్సినంత సమయం తీసుకోవచ్చని అంటూనే.. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్న రీతిలో పుంజుకోవట్లేదని విమర్శించారు. వీటిలో అధిక రాష్ట్రాలు డెమొక్రాట్ల పాలనలోనే ఉండటం గమనార్హం.
తొందరపాటు నిర్ణయాలా?
ఇన్ని రోజులు తన ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉందని, ఫలితంగా ఎన్నో లక్షల ప్రాణాలను కాపాడినట్టు ట్రంప్ చెప్పారు. అయితే కరోనా వైరస్‌పై ట్రంప్ వర్గం నుంచే మిశ్రమ స్పందనలు ఎదురవుతున్నాయి. తన అల్లుడు, సీనియర్ సలహాదారు జారెడ్ కుష్నర్.. ఇప్పట్లో వైరస్ కథ ముగిసిందని అనుకోవడం తొందరపాటు అవుతుందన్నారు.
మరోవైపు దేశవ్యాప్తంగా పాఠశాలలు, యూనివర్సిటీల ప్రారంభించాలని ట్రంప్ అభ్యర్థించారు. కానీ వ్యాక్సిన్ అభివృద్ధి చేసేంత వరకు అది సరైన నిర్ణయం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ట్రంప్ అనేకమార్లు పేర్కొన్నారు. అయితే ట్రంప్ టాస్క్ ఫోర్స్ సభ్యులు మాత్రం వ్యాక్సిన్ కోసం మరో 18నెలలు వేచిచూడక తప్పదని అంచనా వేస్తున్నారు.
అమెరికాలో ఇప్పటివరకు 11,88,122 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 68,598మంది వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి:- '46 రోజులుగా ఇంట్లోనే ఉన్నాం.. ఇక చాలు'