బ్రెజిల్లో ఓ డ్రగ్ స్మగ్లింగ్ ముఠా నాయకుడిని పట్టుకునే ప్రయత్నంలో భాగంగా జరిగిన కాల్పుల్లో 10 మంది మరణించారు. నిఘా వర్గాల సమాచారంతో రియో డి జనీరో రాష్ట్రంలోని మురికివాడలపై పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలోనే నేరస్థులు కాల్పులకు తెగబడ్డారు. చాలాసేపు జరిగిన భీకర పోరులో పోలీసులు వారిని మట్టుబెట్టారు.
మాదక ద్రవ్య వ్యాపారాల్లో కింగ్...
ముఠా నాయకుడి వివరాలేవీ పోలీసులు విడుదల చేయలేదు. అయితే, 2016లో జైలు నుంచి తప్పించుకున్నాడని తెలిపారు. ఐకానిక్ కోపకబానా, ఇపనేమా పరిసర ప్రాంతాలకు సరిద్దులుగా ఉన్న పావో- పావోజిన్వో, కాంటగలోని మురికివాడల్లో మాదక ద్రవ్యాలు, అక్రమరావాణా దందా సాగిస్తున్న నేరస్థుల్లో ఒకరిగా గుర్తించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
తగ్గిన నేరాలు..
ఘటనా స్థలంలో ఎనిమిది రైఫిల్స్, 85 గ్రెనేడ్లు, మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి నుంచి మార్చి వరకు రియో డి జనిరో రాష్ట్రంలో సుమారు 429 మంది నేరస్థులను పోలీసులు మట్టుబెట్టారు. గతేడాదితో పోలిస్తే 1.6శాతం నేరాలు తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది హత్యలు కూడా 0.9 శాతం తగ్గినట్లు తెలిపారు.