అమెరికా ఈశాన్య రాష్ట్రాలను.. ఇడా హరికేన్ (Ida Hurricane) అతలాకుతలం చేసింది. న్యూయార్క్, న్యూ జెర్సీ, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో తుపాను సృష్టించిన విలయానికి(Ida Storm) వేలాది మంది వరదల్లో చిక్కుకున్నారు. గత 50 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని రీతిలో కురిసిన భారీ వర్షాలకు.. భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం కూడా సంభవించగా.. ప్రభుత్వం(Joe Biden Sarkar) యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది.
ఇడా హరికేన్ దెబ్బకు (Ida Hurricane Effect).. ఈశాన్య అమెరికా విలవిల్లాడుతోంది. భారీ తుపాను ధాటికి న్యూయార్క్, న్యూజెర్సీలో పలు లోతట్టు ప్రాంతాలు(America Floods) వరద నీటిలో చిక్కుకున్నాయి. బుధవారం రాత్రి నుంచి రికార్డు స్థాయిలో కురిసిన కుంభవృష్టికి.. ఇళ్లలోకి మోకాలిలోతు నీరు చేరింది. మెట్రో స్టేషన్లు, సబ్‌వేలు పూర్తిగా నీటితో నిండిపోగా.. రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. విమానాలు రద్దయ్యాయి. వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. ఇడా తుపాను(Hurricane Ida) కారణంగా అమెరికాలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క న్యూజెర్సీలోనే 23 మంది, న్యూయార్క్ నగరంలో 13 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వరద తాకిడికి మరో 40 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం.
ల్యారీ తుపాను భయాలు..
గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేనంత స్థాయిలో వరదలు రాగా.. న్యూయార్క్ జాతీయ వాతావరణ సేవా కేంద్రం మొట్టమొదటిసారిగా అత్యవసర హెచ్చరికలను జారీ చేసింది. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత సెంట్రల్ పార్క్‌లో బుధవారం రాత్రి ఒక్క గంటలోనే రికార్డుస్థాయిలో 8.91 సెంటీమీటర్ల వర్షపాతం(America Flood) నమోదైంది. పెన్సిల్వేనియాలోని జాన్స్‌టౌన్‌లో ఓ జలాశయంలో నీరు ప్రమాదకరస్థాయికి చేరుకోగా.. అధికారులు స్థానికులను ఖాళీ చేయించారు. న్యూజెర్సీ, పెన్సిల్వేనియాలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగగా.. లక్షల మంది చీకటితో సావాసం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మూలిగే నక్కపై తాటికాయ పడిన రీతిలో ల్యారీ తుపాను శనివారం కల్లా తీవ్రరూపు దాల్చే అవకాశాలున్నాయని అధికారులు తెలపడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
న్యూజెర్సీలో ప్రచండ గాలులు, టోర్నడోలూ బీభత్సం సృష్టించగా.. భారీగా ఆస్తి నష్టం జరిగింది. 21 కౌంటీల్లో ప్రభుత్వం అత్యయిక స్థితి ప్రకటించింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర వాహనాలు మాత్రమే రోడ్లపైకి రావాలని సూచించింది. మరోవైపు హరికేన్ ధాటికి (Ida Hurricane) తీవ్రంగా నష్టపోయిన లూసియానా ప్రాంతంలో శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) పర్యటించనున్నారు. తుపాన్ వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో వెంటనే పునరావస చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి: లోయలో పడిన బస్సు- 16 మంది మృతి