కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన అమెరికా న్యూయార్క్ నగరం పునఃప్రారంభమైంది. మొదటి దశ సడలింపులను చేపట్టిన సందర్భంగా 100 రోజుల అనంతరం 4లక్షల ఉద్యోగులు విధుల్లో చేరారు. నగరంలో వైరస్ వ్యాప్తి కారణంగా మార్చి మధ్య నుంచి లాక్డౌన్ విధించారు. న్యూయార్క్‌లో ఇప్పటివరకు 2,05,000మంది వైరస్ బారిన పడగా.. మరణాల సంఖ్య 22,000కు చేరువైంది.
"న్యూయార్క్ నగరం ఉండాల్సిన ప్రమాణాలను సాధించింది. ఈ నేపథ్యంలో నగరాన్ని తెరిచాం. న్యూయార్క్ నగరాన్ని పునఃప్రారంభించినప్పుడు అత్యధిక వైరస్ కేసులు ఉన్నాయని గుర్తు పెట్టుకోండి. ఇక్కడ జనసాంద్రత ఎక్కువ. జాగ్రత్త వహించాలి."
- ఆండ్రూ క్యూమో, న్యూయార్క్ గవర్నర్ ప్రకటన
నగరాన్ని మొదటి దశలో ప్రారంభించడాన్ని ఒక మైలురాయిగా అభివర్ణించారు మేయర్ బిల్ డే బ్లాసియో.
వైరస్‌తో తీవ్రంగా ప్రభావితమైన న్యూయార్క్‌లో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్షీణించింది. ఈ నేపథ్యంలోనే పునఃప్రారంభానికి మొగ్గు చూపింది ప్రభుత్వం. ప్రస్తుతం ప్రారంభమైన మొదటి దశ పునఃప్రారంభంలో నిర్మాణ, తయారీ, హోల్‌సేల్ విక్రయాలు, పాక్షికంగా రిటైల్, వ్యవసాయం, అటవీ సంరక్షణ, చేపల పెంపకం వంటి రంగాలకు అనుమతించారు.
పునఃప్రారంభం.. ఈ లెక్కన
ఒక రాష్ట్రం, నగరాన్ని పునఃప్రారంభించేందుకు కచ్చితమైన నిబంధనలు ఏర్పరచింది అమెరికా ప్రభుత్వం. ఒక ఆస్పత్రిలోని మరణాల సగటు మూడు రోజుల్లో ఐదుగురికి మించకపోవడం.. లక్షమంది జనాభాకు రెండు ఆస్పత్రులను అందుబాటులో ఉంచడం వంటి నిబంధనలు అనుసరిస్తేనే.. పునఃప్రారంభానికి అనుమతిస్తోంది.
ఇదీ చూడండి: జులైలో కరోనా కేసులు భారీగా పెరుగుతాయి: ప్రధాని