అమెరికా సార్వత్రిక ఎన్నికల్లో ట్రంప్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. జార్జియా సెనెట్ ఎన్నికల్లో ఇప్పటికే ఓ సీటును గెలుపొందగా.. తాజాగా వెలువడిన ఫలితాల్లోనూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిపై డెమొక్రాట్ అభ్యర్థి జాన్ ఓసోఫ్ గెలుపొందారు. 33 ఏళ్ల ఓసోఫ్.. గత ఆరేళ్లుగా అధికారంలో ఉండి, ట్రంప్‌నకు బలమైన మద్దతుదారుగా నిలిచిన 71 ఏళ్ల రిపబ్లికన్ డేవిడ్ పెర్డ్యూను ఓడించారు.
అంతకముందు రాఫెల్ వార్నోక్.. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి సెన్ కెల్లీ లోయ్ఫ్లర్పై విజయం సాధించారు.
ఓసోఫ్ విజయంతో 100 మంది సభ్యులున్న సెనేట్‌లో ఇరు పార్టీల మధ్య 50-50 సీట్లు వచ్చాయి. ఒకవేళ టై పరిస్థితి ఎదురైతే.. కాబోయే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సెనెట్ ఛైర్‌పర్సన్ హోదాలో ఒక ఓటును డెమొక్రాట్లకు వేయవచ్చు. దీంతో సెనెట్‌తో పాటు పూర్తి కాంగ్రెస్‌లో బైడెన్‌కు ఆధిపత్యం లభిస్తుంది. ఇప్పటికే ప్రతినిధుల సభలో డెమొక్రాట్లకు మెజార్టీ బలం ఉంది.
ఇదీ చదవండి: ట్రంప్ మద్దతుదారుల ఆందోళన హింసాత్మకం