కరోనాతో పోరాడుతున్న సమయంలో చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలు, తీవ్ర ప్రభావానికి గురైన ప్రజలను రక్షించడమే భారతదేశానికి ప్రాధాన్యాలుగా ఉండాలని సూచించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్). మహమ్మారి ప్రభావానికి లోనైన వారే లక్ష్యంగా మద్దతు అందించాలని పేర్కొంది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల సందర్భంగా మాట్లాడిన ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జీవా.. ప్రజలను రక్షించడం, వారి ఆరోగ్యాన్ని కాపాడటం పైనే భారత్ దృష్టి కొనసాగించాలని సూచించారు.
"తీవ్ర ప్రభావానికి గురైన ప్రజలను రక్షించడం, వారికి నేరుగా మద్దతు ఇవ్వడం, చిన్న మధ్య తరహా పరిశ్రమలు కుప్పకూలకుండా రక్షించడం వంటివి చేయాలి. అన్ని చోట్ల ఉన్నట్లే ఈ వైద్య సంక్షోభం నుంచి బయటపడే వరకు ఇబ్బందులు, అనిశ్చితులు, అసమాన పురోగతులు తప్పవు."
-క్రిస్టలీనా జార్జీవా, ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్
ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు భారత్ తన వంతుగా కృషి చేసిందని పేర్కొన్నారు జార్జీవా. జీడీపీలో రెండు శాతం మేర ఆర్థిక చర్యలు, నాలుగు శాతం మేర గ్యారెంటీలు ప్రకటించారని గుర్తు చేశారు. ఇవన్నీ ప్రత్యక్ష ఆర్థిక చర్యలు కాకపోయినా.. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఉపయోగపడతాయని అన్నారు. అయితే అభివృద్ధి చెందిన దేశాలు, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే.. ఈ చర్యలు పరిమితంగానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. భారత జీడీపీ ఈ సంవత్సరం 10 శాతం మేర పడిపోయే అవకాశం ఉందని జార్జీవా అన్నారు.
బాగున్నప్పుడే చక్కదిద్దుకోవాలి
పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థలను పటిష్ఠం చేసుకోవాలని జార్జీవా అన్నారు. ఇది మహమ్మారి నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠమని పేర్కొన్నారు. అలా చేస్తే ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడవచ్చని తెలిపారు.
అధిక రుణాలు, మార్కెట్ యాక్సెస్ లేనందువల్ల అర్జెంటీనా, ఈక్వెడార్లలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని తెలిపారు. ఇలాంటి దేశాలు వెంటనే అప్రమత్తమై, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ రుణ ఆర్కిటెక్చర్‌ను మెరుగుపర్చడమే వచ్చే నెలల్లో ఐఎంఎఫ్ అజెండా అని తెలిపారు.