మనవరాలు జైలులో ఉందంటూ ఓ వృద్ధురాలి (Grandparent Scams 2021) నుంచి రూ.5 కోట్లు కాజేశారు గుర్తుతెలియని వ్యక్తులు. అమెరికాలోని ఫ్లోరిడాలో (Grandparent Scams 2021) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇదీ జరిగింది..
'హలో మేడమ్.. మీ మనవరాలు యాక్సిడెంట్ కేసులో చిక్కుకుని జైలులో ఉంది. ఆమెను బయటకు తీసుకురావాలంటే ఖర్చు అవుతుంది,' అంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ వ్యక్తి బాధితురాలికి ఫోన్ చేశాడు. తాను.. ఆమె మనవరాలి తరపు లాయర్నని(Grandparent Scams 2021) చెప్పి నమ్మించాడు. అనుమానం రాకుండా ఉండేందుకు ఓ మహిళతో సొంత మనవరాలిగా మాట్లాడించాడు. దీంతో నిజమేనని భావించిన వృద్ధురాలు డబ్బు ఇచ్చేందుకు అంగీకరించింది.
ఆమె ఖాతాలోని డబ్బును వివిధ శాఖల నుంచి భారీ మొత్తంలో విత్‌డ్రా చేయమని సూచించారు. నిందితుల సూచనల మేరకు బీబీ అండ్ టీ బ్యాంక్ ఖాతా నుంచి 13 విడతల్లో డబ్బును డ్రా చేసి వారికి పంపించింది. ఇలా రూ. 5కోట్లు(7లక్షల డాలర్లు) ఇచ్చేయగా.. చివరికి ఆమె ఖాతాలో 74 లక్షలు మిగిలాయి (లక్ష డాలర్లు). ఇంత భారీ మొత్తంలో డబ్బును తీసుకోవడంపై ఒకవేళ బ్యాంకు ప్రశ్నిస్తే.. ఇంటి పనుల కోసం వాడినట్లు చెప్పమని సలహా ఇచ్చారు.
చివరికి.. మోసపోయానని గుర్తించిన వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనను 'గ్రాండ్పేరెంట్ స్కామ్'గా పేర్కొన్న బాధితురాలి తరపు న్యాయవాది.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్యాంకులపై కూడా చర్యలు చేపట్టాలన్నారు.
పోలీసుల చర్యలు...
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏప్రిల్-ఆగస్ట్ మధ్య బాధితురాలి ఇంటికి రాకపోకలు జరిపిన వారి వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో క్యాబ్‌లలో వచ్చిన వారి వివరాల కోసం సంబంధిత సంస్థలను సంప్రదించామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : ఉద్యోగాలకు టాటా- ఒక్క నెలలోనే 44 లక్షల మంది..