ఎన్నికల్లో ఎలాంటి కుట్ర లేదని దేశవ్యాప్తంగా రెండు ప్రధాన పార్టీల నేతలు చెబుతున్నప్పటికీ.. ఎలాంటి ఆధారాలు లేకుండానే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియపై వ్యాజ్యాలు కూడా దాఖలు చేశారు ట్రంప్ మద్దతుదారులు.
పెన్సిల్వేనియాలో దాఖలైన వ్యాజ్యాలపై విచారించిన అక్కడి ఫెడరల్ కోర్టు.. మోసాలకు సంబంధించి రుజువులు ఉన్నాయా అని ప్రశ్నించింది. ఈ విషయంలో ట్రంప్ తరఫు న్యాయవాదులు 'లేదు' అనే సమాధానం చెప్పాల్సి వచ్చింది. ప్రజల మోసం చేశారని చెప్పడం లేదని, ఎన్నికలు సజావుగా జరగాలనే మా ప్రయత్నమని వివరణ ఇచ్చారు.
మిషిగన్, జార్జియా వంటి రాష్ట్రాల్లోని కోర్టులూ వ్యాజ్యాల్లో లోపాలు ఉన్నాయని కొట్టివేశాయి.
న్యాయవాదులకు చిక్కులు..
ఈ విషయంలో న్యాయవాదులకు కూడా చిక్కులు ఎదురవుతున్నాయి. క్లయింట్ తరఫున వాదించటం, అదే సమయంలో వృత్తిపరమైన ప్రమాణాన్ని నిలబెట్టుకోవటం కష్టంగా మారింది. బైడెన్ అధికారంలోకి రాకుండా ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు న్యాయవాదులు సహకరించం ఏంటని ప్రజాస్వామ్య వాదులు ప్రశ్నిస్తున్నారు.
రుజువుల కోసం..
ఎన్నికల్లో మోసాలపై ఆధారాల వేటలో పడింది ట్రంప్ బృందం. ఈ క్రమంలో ఎన్నికల్లో అవినీతిని నిర్లక్ష్యం చేశారని పెన్సిల్వేనియాలోని రిపబ్లికన్ అధికారి అల్ ష్మిత్పైనా ట్రంప్ ఆరోపణలు చేశారు. అర్హత ఉన్నవారి ఓట్లను లెక్కించటం అవినీతి కాదని, ఇది ప్రజాస్వామ్యమని ష్మిత్ వివరణ ఇచ్చారు.
అయితే, కొంత మంది ఓటర్లు ట్రంప్ వాదనను అంగీకరిస్తున్నారు. న్యాయపోరాటానికి నిధులు సమకూరుస్తున్నారు.
ఇదీ చూడండి: ట్రంప్ సహకారం లేకుండానే బైడెన్ ముందుకెళతారా?