అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉంటారా? అనే ప్రశ్నకు జవాబు ఇచ్చేందుకు నిరాకరించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు' అని స్పష్టం చేశారు. ఈ అంశానికి బదులుగా ఎన్నికల్లో తాను అత్యధికంగా ఓట్లు సాధించానని, తానే విజయం సాధించానని పునరుద్ఘాటించారు ట్రంప్.
" మేం గొప్పగా పని చేసామన్నదాని గురించి మాట్లాడాలనుకుంటున్నా. దేశ చరిత్రలోనే అధ్యక్షులందరికన్నా అత్యధికంగా ఓట్లు సాధించాను. అది చాలా దగ్గరి సంఖ్య కూడా కాదు. ఒబామా కన్నా 75 మిలియన్లు ఎక్కువ. మేము ఎన్నికల్లో ఓడినట్లు వారు చెప్పారు. మేము ఓడిపోలేదు."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవ సమయానికి ట్రంప్ తన ఓటమిని అంగీకరించకపోతే తలెత్తే పరిస్థితుల గురించి మాట్లాడగా.. " దేశానికి చట్టవిరుద్ధమైన అధ్యక్షుడు ఉండటం గురించి ఆందోళన చెందుతున్నా. ఆయన ఘోరంగా ఓటమిపాలైన అధ్యక్షుడు. ఇది హోరాహోరీగా సాగిన ఎన్నిక కాదు. జార్జియాలో చూస్తే.. అక్కడ మేమే గొప్పగా గెలిచాం. పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ వంటి రాష్ట్రాల్లో భారీ ఓట్లతో గెలిచాం. " అని పేర్కొన్నారు ట్రంప్.
కీలక రాష్ట్రాల్లో ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ టెక్సాస్ అటార్నీ జనరల్ దాఖలు చేసిన పిటిషన్‌ను గత శుక్రవారం కొట్టివేసింది ఆ దేశ సుప్రీం కోర్టు. ఈ క్రమంలో ట్రంప్‌కు ఉన్న చివరి అవకాశానికి తెరపడినట్లయింది.
ఇదీ చూడండి: అగ్రరాజ్య పోరులో నేడు మరో కీలక ఘట్టం