భారత్ సరిహద్దు వివాదంలో అమెరికా మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించింది చైనా. సరిహద్దు వివాదాలు పరిష్కరించుకునేందుకు ఇరుదేశాలు అవసరమైన వ్యవస్థలు కలిగి ఉన్నాయని చైనా విదేశాంగ ప్రతినిధి జావో లీజియాంగ్ స్పష్టం చేశారు. ఇరు దేశాల విబేధాలను తొలగించటానికి మూడో పార్టీ (అమెరికా ) జోక్యం అవసరం లేదని వెల్లడించారు.
ట్రంప్ నోట మరోసారి మధ్యవర్తిత్వం...
భారత్- చైనా మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యల పరిష్కారానికి మధ్యవర్తిగా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉద్ఘాటించారు. సరిహద్దు సమస్య గురించి ప్రధాని మోదీతో సంభాషించినట్లు చెప్పిన ట్రంప్.... చైనా తీరు పట్ల మోదీ అసంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. సరిహద్దు ఉద్రిక్తతల వల్ల రెండు దేశాలు సంతోషంగా లేవని తెలిపారు.
భారత్ స్పందన...
ట్రంప్‌తో అలాంటి సంభాషణ ఏదీ ప్రధాని మోదీతో జరుగలేదని విదేశాంగ కార్యాలయం తెలిపింది. ఇద్దరు నేతలు చివరి సారిగా ఏప్రిల్ 20న హైడ్రాక్సి క్లోరోక్విన్ ఔషధం గురించి చర్చించినట్లు స్పష్టం చేసింది.
అటు ట్రంప్ ట్వీట్ ప్రతిపాదనపై ఇప్పటికే అత్యంత సున్నితంగా భారత్ సమాధానం ఇచ్చింది. చైనాతో సరిహద్దు వివాద పరిష్కారానికి శాంతియుతంగా చర్చలు జరుగుతాయని భారత విదేశాంగ ప్రతినిధి శ్రీవాస్తవ స్పష్టం చేశారు. ఇరువైపులా సైన్యం, దౌత్యవేత్తల స్థాయిలో చర్చలు జరుగుతాయని తెలిపారు.
ఇదీ చూడండి:సరిహద్దు అంశమై మోదీ సంతృప్తిగా లేరు: ట్రంప్