మీరు కలుషిత గాలి పీల్చుతున్నారా? అయితే అధిక బరువు పెరుగుతారంటోంది జర్నల్ ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ సర్వే. అంతేకాదు ఈ గాలి వల్ల మధుమేహం, ఊబకాయం, జీర్ణాశయ సంబంధిత రుగ్మతలు, క్రోనిక్ సంబంధిత అనారోగ్య సమస్యలు పొంచి ఉన్నాయని సర్వేలో తేలింది.
" వాయు కాలుష్యం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కలుషితమైన గాలి పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు అధిక బరువు పెరుగుతారు. దీనివల్ల టైప్-2 మధుమేహంతో పాటు ఊబకాయం వస్తుంది. ఓజోన్ పొర కూడా తీవ్రంగా దెబ్బతింటోంది."
-- తాన్య అల్డరేట్, సీనియర్ రచయిత
అమెరికాలోని చాలా నగరాల్లో వాయు నాణ్యత మరింత క్షీణించిన నేపథ్యంలో ఈ సర్వే చేపట్టారు. గత డిసెంబర్లో జాతీయ ఓజోన్ ప్రమాణాలను పాటించడంలో విఫలమైనందున డెన్వర్ మెట్రో, నార్త్ ఫ్రంట్ రేంజ్ ప్రాంతాలను మరింత హానికర ప్రదేశాలుగా గుర్తించింది పర్యావరణ పరిరక్షణ సంస్థ. వీటితో పాటు కాలిఫోర్నియాలోని కొన్ని నగరాలు, టెక్సాస్, ఇల్లినాయిస్, కనెక్టికట్, ఇండియానా, న్యూజెర్సీ, న్యూయార్క్, విస్కాన్సిన్లకు జరిమానా విధించింది. ఈ వాయు కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏడాది 8.8 మిలియన్ (88 లక్షల) మంది ప్రజలు మరణిస్తున్నారు.
అనేక సమస్యలకు మూల కారణం
వాయు కాలుష్యం వల్ల ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తున్నాయని, అంతే కాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని అల్డరేట్ గత పరిశోధనలు చెబుతున్నాయి. ట్రాఫిక్ సమయంలో అధికంగా విడుదలయ్యే కర్బన ఉద్గారాల వల్ల చాలా మంది యువతకు క్రోన్ వ్యాధి వచ్చే ప్రమాదం పొంచి ఉంది. దీనిపై దక్షిణ కాలిఫోర్నియాలో 101 మంది యువకులపై పరీక్షలు నిర్వహించగా.. కాలుష్య ఉద్గారాలు పెరగడం వల్ల హానికర 128 రకాల బాక్టీరియాలను గుర్తించామని.. వీటిలో కొన్ని ఇన్సులిన్ విడుదలపై ప్రభావితం చూపుతున్నాయని ఆల్డరేట్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఆ దేశ మంత్రికి కరోనా.. ప్రభుత్వమంతా నిర్బంధంలోనే!