అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ అధికారం చేపట్టిన తొలిరోజే వలసదారులకు సంబంధించి కీలక బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా... వలసదారులకు సులువుగా పౌరసత్వం కల్పించే విధంగా బిల్లు ప్రతిపాదించనున్నారు. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే కోటి పది లక్షల మంది వలసదారుల లబ్ధిపొందుతారు.
బిల్లులో ఏముంది..
ప్రతిపాదిత బిల్లు ప్రకారం అక్రమ వలసదారులకు 8 ఏళ్లలో చట్టబద్ధత కల్పించడం సహా పౌరసత్వం పొందే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది జనవరి 1 వరకు ఉన్న అక్రమ వలసదారులకు ఐదేళ్లకు తాత్కాలిక చట్టబద్ధతను కల్పిస్తారు. ఆ తర్వాత మూడేళ్లకు వారికి అమెరికా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ చర్యతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేసిన కఠిన నియమాల నుంచి వలసదారులకు విముక్తి కలుగుతుంది.
అమెరికా అధ్యక్షునిగా బైడెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ బిల్లును ప్రతిపాదించే అవకాశం ఉంది. పలు ముస్లిం దేశాలపై ట్రంప్ విధించిన ఆంక్షలనూ బైడెన్ తొలగించే అవకాశం ఉంది.
సవాళ్ల సవారీకి సిద్ధం!
బైడెన్ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశాక వచ్చే సవాళ్లను ఎదుర్కోవడం అంత సులభం కాదని ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ అన్నారు.
"కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు మేము రూపొందించిన ప్రణాళికల అమలు క్షేత్రస్థాయిలో సాధ్యం కాదని కొందరు భావిస్తున్నారు. కానీ కాంగ్రెస్ సభ్యుల సహకారంతో మేము వాటిని అమలు చేయగలమని నమ్ముతున్నాము."
-కమలా హారిస్
అభిమానం..
పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన జగ్జోత్ సింగ్ అనే కళాకారుడు బైడెన్, కమలా హారిస్ చిత్రాలు గీసి అభిమానం చాటుకున్నాడు. కమలా హారిస్ ఉపాధ్యక్షురాలు కాబోతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపాడు. ఈ చిత్రాలను ప్రమాణస్వీకారం సందర్భంగా బైడెన్, హారిస్‌కు బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నాడు.
ఇదీ చదవండి : అమెరికా అధ్యక్షుడి కేబినెట్ ఎలా?