అమెరికా క్యాపిటల్ భవనం వద్ద చెలరేగిన హింసాత్మక ఘటనను ఖండించారు అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్. దాడిలో పాల్గొన్న వారిని దేశీయ ఉగ్రవాదులుగా పేర్కొన్నారు. వాషింగ్టన్‌తో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఘటనను సూచిస్తూ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోమారు విమర్శలు గుప్పించారు. క్యాపిటల్ హిల్ వద్ద ఆందోళనలు జరిగిన రోజును దేశ చరిత్రలోనే చీకటి రోజుగా అభివర్ణించారు.
" నిన్న జరిగిన ఘటన అసమ్మతి కాదు. నిరసన అంతకన్నా కాదు. అది ఒక గందరగోళ సంఘటన. వారు నిరసనకారులు కాదు. వారిని ఆందోళనకారులుగా పిలిచేందుకు కూడా సాహసం చేయలేం. వారంతా అల్లరి మూకలు, తిరుగుబాటుదారులు, దేశీయ ఉగ్రవాదులు."
- జో బైడెన్, అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత
అధ్యక్ష పదవిలో దేశ ప్రజాస్వామ్య సంస్థలను అణచివేయడానికి ట్రంప్ తీసుకున్న చర్యలే.. వాషింగ్టన్ హింసకు దారితీశాయని ఆరోపించారు బైడెన్. గత నాలుగేళ్లలో మన ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, చట్టాలను ధిక్కరించారనేది ఆయన చేసిన ప్రతి పనిలో స్పష్టంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు. తొలినుంచే ప్రజాస్వామ్య సంస్థలపై దాడి చేశారని, బుధవారం జరిగింది నిరంతర దాడికి పరాకాష్ఠగా పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'క్యాపిటల్'కు నిలువెల్లా గాయాలే..