కరోనా వ్యాధిని నయం చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ముమ్మరంగా పరిశోధనలు సాగుతున్నాయి. తాజాగా 'ఎస్టీఐ-1499' అనే యాంటీబాడీ ... కొవిడ్-19కు కారణమైన సార్స్ కోవి-2ను ఆరోగ్యవంతమైన కణాలకు వ్యాప్తి చెందనివ్వకుండా పూర్తిగా నిరోధించే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోందని వెల్లడైంది.
కాలిఫోర్నియాలోని శాన్‌డియాగోకు చెందిన 'సొరెంటో థెరప్యూటిక్స్' అనే బయోఫార్మాస్యూటికల్ సంస్థ తాజా పరిశోధన ఫలితాలను ప్రకటించింది.
"ప్రాథమిక జీవరసాయన, జీవభౌతిక విశ్లేషణలు ఎస్టీఐ-1499ని ఒక శక్తివంతమైన యాంటీబాడీ డ్రగ్‌గా సూచిస్తున్నాయి. ప్రీ క్లీనికల్ లాబొరేటరీ ప్రయోగాల్లోనూ... చాలా తక్కువ మోతాదులోని ఎస్టీఐ-1499 యాంటీబాడీ... సార్స్ కోవి-2ను నిరోధించగలిగింది." - సొరెంటో థెరప్యూటిక్స్
కాక్టెయిల్ రక్షణ కవచం..
సొరెంటో థెరప్యూటిక్స్... సార్స్-కోవి-2 సంక్రమణను అడ్డుకునే రక్షణ కవచంలా ఒక కాక్టెయిల్ యాంటీబాడీని తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సంస్థ ఇప్పటికే బిలియన్ల కొద్ది యాంటీబాడీలను పరీక్షించింది. వీటి నుంచి సార్స్-కోవి-2 స్పైక్ ప్రొటీన్‌కు చెందిన ఎస్-1 సబ్యూనిట్ను బంధించే వందలాది యాంటీబాడీలను గుర్తించింది.
వీటిలోని ఓ డజను యాంటీబాడీలు... 'ఎస్-1 ప్రోటీన్' మానవశరీరంలోని (యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్2) ఏసీఈ-2 ఎంజైమ్‌తో కలవడాన్ని సమర్థవంతంగా నిరోధించగలుగుతున్నాయని పరిశోధనల్లో తేలింది.
ఈ యాంటీబాడీలను ఇన్విట్రో సార్స్-కోవి-2 సోకిన కొంత మంది వ్యక్తులపై పరీక్షించారు. వీటిలో ఎస్టీఐ-1499 అనే యాంటీబాడీ... మానవశరీరంలోని ఆరోగ్యవంతమైన కణాలల్లో సార్స్-కొవి-2 సంక్రమణ చెందకుండా పూర్తిగా నిరోధించే సామర్థ్యాన్ని ప్రదర్శించింది.
స్టాండ్ అలోన్ థెరపీ..
ఎస్టీఐ-1499ను స్టాండ్ అలోన్ థెరపీగా అభివృద్ధి చేయవచ్చని సొరెంటో థెరప్యూటిక్స్ భావిస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతులు లభిస్తే, దీని ఉత్పత్తిని పెంచి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది. ఈ యాంటీబాడీ అనేకమంది ప్రాణాలను రక్షించగలుగుతుందని సంస్థ విశ్వాసం వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి: వీధుల్లో ఆ మందు స్ప్రే చేయడం ప్రమాదకరం!