అంతరిక్ష పర్యటకంలో సరికొత్త శకానికి ఆదివారం నాంది పడింది. వర్జిన్ గెలాక్టిక్ నిర్మించిన వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22 ప్రయోగం విజయవంతమైంది. అందులోని వ్యోమగాములకు ప్రపంచ నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ సహా మరో ఐదుగురు వ్యోమగాములతో కూడిన బృందాన్ని తీసుకుని వ్యోమనౌక న్యూమెక్సికో నుంచి రోదసీలోకి చేరింది.
మూడో భారత వనితగా..
నేల నుంచి దాదాపు 88 కిలోమీటర్ల ఎత్తులోని.. సబ్ ఆర్బిటల్ ఎత్తుకు చేరుకుంది. అక్కడి నుంచి భూమిని చూస్తూ.. అందులోని వ్యోమగాములు గొప్ప అనుభూతిని పొందారు. రోదసి యాత్ర విజయవంతంతో.. 70 ఏళ్ల వయసులో అంతరిక్షంలోకి వెళ్లిన రెండో వ్యక్తిగా వర్జిన్ గెలాక్టిక్ అధిపతి.. బ్రాన్సన్ ఘనత సాధించారు. అటు తెలుగు మూలాలున్న బండ్ల శిరీష.. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత అంతరిక్షంలో పయనించిన మూడో భారత వనితగా రికార్డు సృష్టించారు.
'అదో గొప్ప అనుభూతి..'
2011లో శిరీష తన ఏరోనాటికల్, ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. అనంతరం జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. ప్రస్తుతం ఆమె వర్జిన్ గెలాక్టిక్ సంస్థలో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి తెలుగు మహిళగా ఖ్యాతి గడించిన భారతీయ అమెరికన్ బండ్ల శిరీష... తన స్పేస్ యాత్రపై స్పందించారు. భూమిని అంతరిక్షం నుంచి చూడటం గొప్ప అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. ఈ మేరకు ఓ అంతర్జాతీయ మీడియా ముఖాముఖిలో ఆమె మాట్లాడారు.
"నా జీవితాన్ని మార్చే అనుభవం ఈ యాత్ర నాకు ఇచ్చింది. ఈ ప్రయాణం ఓ అద్భతం. నాకు ఎప్పటినుంచో వ్యోమగామి అవ్వాలన్న కోరిక ఉండేది. అయితే... నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్-NASA ద్వారా అంతరిక్షంలోకి వెళ్లేందుకు సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో నా కల నెరవేర్చుకునేందుకు ఈ అసాధారణమైన మార్గాన్ని ఎంచుకున్నాను. "
- బండ్ల శిరీష, వ్యోమగామి
వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్‌సన్‌తో కలిసి ఆయన నిర్మించిన వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22 ద్వారా.. బండ్ల శిరీష తన అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.
ఇవీ చూడండి: