2020లో అమెరికా తన హిట్‌లిస్ట్‌ను లక్ష్యంగా చేసుకొని పశ్చిమాసియాలో పనిచేస్తోంది. గత నెల ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ సులేమానీని డ్రోన్ దాడిలో మట్టుబెట్టిన అగ్రరాజ్యం ఇప్పుడు అల్ ఖైదా అగ్రనాయకుడు ఖాసీం అల్-రైమిని లక్ష్యంగా చేసుకొంది. అమెరికా నిఘా సంస్థ సీఐఏ డ్రోన్లు కొన్ని రోజుల కిందటే రైమిని హతమార్చాయి. కానీ, ఈ విషయాన్ని నిఘా వర్గాలు గోప్యంగా ఉంచాయి. రైమిని తాము మట్టుబెట్టినట్లు ఎట్టకేలకు నిన్నరాత్రి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. వాస్తవానికి ఈ దాడి సెనెట్‌లో అధ్యక్షుడిపై అభిసంశన ఓటింగ్‌కు కొన్ని రోజుల ముందే చోటు చేసుకోవడం గమనార్హం.
ఎవరీ ఖాసీం రైమి..?
రైమి అల్-ఖైదా అరేబియా ద్వీపకల్ప విభాగానికి నాయకత్వం వహిస్తున్నాడు. 1990 నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ముఖ్యంగా అమెరికా సైనిక స్థావరాలు, దౌత్యకార్యాలయాలపై జరిగిన భారీ దాడుల్లో, దౌత్య అధికారి హత్య కుట్రల్లో రైమి హస్తం ఉంది. యెమెన్‌లో అమెరికా దౌత్య అధికారిని చంపేందుకు కుట్ర పన్నిన కేసుకు సంబంధించి 2005లో అతనికి ఐదేళ్లు జైలు శిక్ష కూడా పడింది. కానీ 2006లో అతను తప్పించుకొన్నాడు. ఆ తర్వాత ఉగ్రకార్యకలాపాలను ముమ్మరం చేశాడు. 2008లో సనాలో అమెరికా దౌత్యకార్యాలయంపై దాడి.. 2009లో ‘అండర్‌వేర్ బాంబర్’ ఘటనలో ఇతడు నిందితుడు. 2015లో అల్‌ఖైదా యెమెన్ విభాగానికి నాయకుడిగా ఎదిగాడు. ఇతని సమాచారం అందజేస్తే 10 మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తామని అమెరికా ప్రకటించింది.
'టీమ్6' విఫలమైనా.. డ్రోన్‌కు దొరికి..
రైమిని మట్టుబెట్టాలని అమెరికా కొన్నేళ్ల క్రితమే ప్రణాళికలు రచించింది. కానీ అతని ఆచూకీ కచ్చితంగా కనుక్కోలేకపోయింది. 2017లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన తొలి భారీ ఉగ్ర ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రైమిని అంతం చేయడమే ఆ ఆపరేషన్ లక్ష్యం. దీనికోసం నేవీ సీల్స్‌కు చెందిన టీమ్ 6ను రంగంలోకి దింపారు. కానీ, అమెరికాకు చెందిన విలియమ్ ఓవెన్స్ అనే నేవీలోని చీఫ్ పెట్టీ ఆఫీసర్ మరణించడం వల్ల ఈ ఆపరేషన్‌ను పక్కనబెట్టారు.
ఆ తర్వాత 2019 డిసెంబరు 6న ఫ్లోరిడాలోని అమెరికా నావికాదళానికి చెందిన పెన్సకోలా వైమానిక స్థావరంలో భారీ ఎత్తున ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సౌదీ అరేబియాకు చెందిన ఓ సైనికాధికారి మృతిచెందడం వల్ల పాటు ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే, దాడికి పాల్పడ్డ ముష్కరుణ్ని అమెరికా వెంటనే మట్టుబెట్టింది. మరోవైపు ఈ దాడికి బాధ్యతవహిస్తూ ఏక్యూఏపీ గత ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ఇక రైమిని ఉపేక్షించకూడదని అమెరికా నిర్ణయించుకొంది. దాడికి కొన్ని నెలల ముందే సౌదీలోని అమెరికా దళాల సంఖ్యను గణనీయంగా పెంచింది.
ఈ ఆపరేషన్ కోసం అమెరికా డ్రోన్లను రంగంలోకి దింపింది. సీఐఏ ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు 'హంటర్ కిల్లర్'ను దీనికి కూడా వాడే అవకాశం ఉంది. ఈ డ్రోన్లు గంటకు 480 కిలోమీటర్ల వేగంతో దాదాపు 1800 కిలోమీటర్లు ఏకధాటిగా ప్రయాణించగలవు. ఇవి పెద్దగా ధ్వనిని సృష్టించవు. ఒక్కో డ్రోన్‌ను కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి ఇద్దరు నడిపిస్తుంటారు. ఇవి సమీపంలోకి వచ్చే వరకూ ఎవరూ పసిగట్టలేరు. వీటినే ఐఆర్‌జీసీ కమాండర్ ఖాసీం సులేమానీపై ఆపరేషన్‌లో కూడా వినియోగించారు. యెమెన్ సమీపంలోని యూఏఈలోని వైమానిక స్థావరాల నుంచి వీటిని తరలించి ఉండొచ్చు. వీటిలోని క్షిపణులు యుద్ధట్యాంక్‌ను కూడా తునాతునకలు చేయగలవు.
కొన్ని నెలల క్రితమే నిఘా..
రైమి సమాచారం తెలుసుకొన్న అమెరికా అతడి కదలికలపై కొన్ని నెలల క్రితమే నిఘా పెట్టింది. గత నవంబర్‌లో రైమి స్థావరంపై కీలక సమాచారాన్ని ఒక ఇన్ఫార్మర్ నుంచి అమెరికా అందుకొంది. అప్పటి నుంచి నిఘా పెట్టింది. ఇటీవల సీఐఏ డ్రోన్ రైమి పై దాడి చేసింది. కానీ, అతడి మృతి విషయం ధ్రువీకరించడంలో జాప్యం జరిగింది. మరోపక్క అమెరికా అధ్యక్షుడిపై అభిశంసన విచారణ కొనసాగుతుండగా ఈ దాడి జరగడం గమనార్హం.