ఓ స్థలం కొని ఇల్లు కట్టాలంటే ఎన్నో విషయాలు ఆలోచిస్తాం. ఎక్కడ కొనాలి? స్థలం ఎవరిది? వివాదాలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలిస్తాం. ప్రభుత్వాలు కూడా ఏవైనా కట్టడాలు నిర్మించాలనుకుంటే తమ ఆధీనంలో ఉండే భూముల్లోనే నిర్మిస్తాయి. కానీ, అమెరికా ఓసారి బ్రిటన్ చొరబాట్లను అడ్డుకోవడం కోసం తమ దేశంలో కట్టాల్సిన భారీ కోటను.. పొరపాటున పక్కదేశంలో నిర్మించింది. దాదాపు కోట నిర్మాణం పూర్తయ్యే సమయానికి జరిగిన పొరపాటు తెలుసుకున్న ప్రభుత్వాధికారులు నాలుక్కరుచుకున్నారు.
బ్రిటీష్ పాలన నుంచి అమెరికాకు 1776లోనే స్వాతంత్ర్యం వచ్చినా.. పక్కదేశమైన కెనడాలో బ్రిటన్ పాలన చాలా కాలం కొనసాగించింది. అయితే పలుమార్లు కెనడాలోని బ్రిటీష్ సైన్యం యూఎస్‌లో అడుగుపెట్టేందుకు ప్రయత్నించేది. ఈ క్రమంలోనే 1812-1815 మధ్య అమెరికా, బ్రిటన్ కెనడాకు మధ్య యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలో లేక్ చాంప్లేన్ అనే ఐలాండ్ లాంటి ప్రాంతం బాగా దెబ్బతింది. దీని ద్వారానే బ్రిటీష్ సేనలు అమెరికాలోకి చొరబడే అవకాశం ఉందని, మళ్లీ బ్రిటీష్ చొరబాట్లు పునరావృతం అవుతాయని భావించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మేడిసన్.. 1816లో లేక్ చాంప్లేన్ సరస్సు చుట్టూ భారీ కోట నిర్మించాలని భావించారు.
30 అడుగుల ఎత్తు కోటను నిర్మించి, అందులో ఆయుధాలు సమకూరిస్తే.. బ్రిటీష్ సైన్యం దాడులను సులభంగా అడ్డుకోవచ్చని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ లేక్ చాంప్లేన్ న్యూయార్క్ రాష్ట్ర పరిధిలో ఉండటం వల్ల అక్కడి ప్రభుత్వం కోట నిర్మాణం కోసం 400 ఎకరాలు కేటాయించింది. వెంటనే అధికారులు కోట నిర్మాణం ప్రారంభించారు. 1817లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జేమ్స్ మన్రో కూడా ఈ కోట నిర్మాణం పనులను పరిశీలించారు. అయితే దాదాపు కోట నిర్మాణం పూర్తయ్యే సమయానికి అంటే 1818లో అక్కడి అధికారులు తాము చేసిన పొరపాటును గుర్తించారు. అమెరికాలో నిర్మించాల్సిన కోటను ఏ ప్రాంతం నుంచి అయితే బ్రిటీష్ సేనలు రావొద్దని భావించారో కెనడా భూభాగంలో నిర్మించడం గమనార్హం.
1783 పారిస్ ఒప్పందం ప్రకారం 'లేక్ చాంప్లేన్' కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్ పరిధిలోకి వస్తుంది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అమెరికా ప్రభుత్వం కోట నిర్మాణాన్ని నిలిపివేసింది. అప్పటి నుంచి ఈ కోటను 'ఫోర్ట్ బ్లండర్' అని పిలిచేవారు. దాదాపు 20ఏళ్ల పాటు ఆ కోటను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో స్థానికులు ఆ కోటలోని రాళ్లు, ఇతర ఇంటి నిర్మాణ సామగ్రిని ఎత్తుకెళ్లి వారి ఇళ్లు, దుకాణాల నిర్మాణంలో ఉపయోగించుకున్నారు.
ఎట్టకేలకు 1842లో అమెరికా, బ్రిటన్ అధికారులు చర్చలు జరపడం వల్ల సరిహద్దులను పునరుద్ధరించి.. లేక్ చాంప్లేన్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ఆ కోట పక్కనే మరో కోటను నిర్మించి.. దానికి బ్రిటన్‌తో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడిన సైనికాధికారి మేజర్ జనరల్ రిచర్డ్ మాంట్‌గమొరీ పేరు పెట్టింది. దీంతో ఆ కోట 'ఫోర్ట్ మాంట్‌గమొరీ'గా నిలిచిపోయింది. అయితే ఈ కోటను 1926లో అమెరికా ప్రభుత్వం వేలంపాటలో అమ్మేసింది. అనేక మంది చేతులమారి చివరగా 1983లో విక్టర్ పాడ్ అనే వ్యక్తి ఆస్తిగా మారింది. 2006లో దీనికి పాడ్ ఈ-బేలో అమ్మకానికి పెట్టాడు. కానీ ఇప్పటి వరకు ఆ కోట అమ్ముడుపోలేదు. అయితే న్యూయార్క్ ప్రభుత్వం మాత్రం దీనిని చారిత్రక పర్యటక ప్రాంతంగా మార్చేసింది.
ఇదీ చూడండి: చైనాలో మైనారిటీల అణచివేతకు 380 నిర్బంధ కేంద్రాలు!