అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. అగ్రరాజ్యంలో భారతీయ అమెరికన్ల ఘనతపై భారత సంతతికి చెందిన పలువురు పుస్తకం రచించారు. 'కమలా హారిస్ అండ్ ది రైజ్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్' పేరుతో ప్రచురితం అయిన ఈ పుస్తకంలో భారతీయ అమెరికన్ల వృద్ధి గురించి వివరించారు. అంతేకాదు.. అమెరికా ఉపాధ్యక్షురాలిగా గెలుపొందిన కమలా హారిస్ ప్రయాణం గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించారు. ఈ విషయాన్ని నిర్వాహకులు వెల్లడించారు. ఈ పుస్తక రచనలో దౌత్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు తదితరులు భాగమవటం గమనార్హం.
'అమెరికాలో స్థిరపడ్డ విదేశీయులు కూడా రాణించగలరు అనడానికి కమలా హారిస్ ప్రయాణం ఉదాహరణ. ఒకప్పుడు భారతీయ అమెరికన్లకు పలు రంగాల్లో మాత్రమే గుర్తింపు ఉండేది. కానీ ఇప్పుడు సాంకేతికం, వ్యాపారం, వైద్యం ఇలా ఎన్నో రంగాల్లో రాణిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాం. అమెరికా సహా ప్రపంచ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాం.'
-ఎంఆర్ రామస్వామి, పుస్తక రచయిత
16 వ్యాసాల్లో వివిధ రంగాలకు చెందిన నిపుణులు.. అమెరికాలో భారత సంతతి విజయానికి సంబంధించి తమ అనుభవాలను పంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ పుస్తకం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నట్లు రచయితలు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి : అఫ్గాన్ బాధ్యతల నుంచి వైదొలిగిన అమెరికా టాప్ కమాండర్