Sudan PM resigns: సుడాన్ ప్రధాని అబ్దుల్లా హమ్డోక్ రాజీనామా చేశారు. సైనిక తిరుగుబాటుతో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన నేపథ్యంలో తాను ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
అంతకముందు ఆదివారం.. సైనిక తిరుగుబాటును నిరసిస్తూ వేలాది మంది ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ఖార్టూమ్, అమ్డుర్మన్ నగరాల్లో రోడ్లపైకి వచ్చిన జనం.. టైర్లకు నిప్పంటించి నిరసన తెలిపారు. పరిస్థితిని అదుపుచేసేందుకు భద్రతాదళాలు బాష్పవాయువును ప్రయోగించాయి. కాల్పులు కూడా జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. పలువురు గాయపడ్డారు. ఈ విషయాన్ని ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమంలో భాగమైన వైద్యుల కమిటీ తెలిపింది.
అక్టోబరులో జరిగిన సైనిక తిరుబాటుకు భారీ సంఖ్యలో ప్రజలు నిరసన చేపట్టారు. ఈ పరిణామాల తర్వాత జరిగిన ఒప్పందం ప్రకారం ప్రధానమంత్రిని తిరిగి నియమించింది సైన్యం. అయితే ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమాన్ని పక్కదారి పట్టించింది. తాజాగా దేశంలోని అనేక ప్రాంతాల్లో అంతర్జాల సేవలు నిలిచిపోయాయి. వంతెనలను మూసివేశారు. దీంతో గతేడాది అక్టోబరులో అమలు చేసిన వ్యూహాలనే మరోసారి తెరపైకి సైన్యం తీసుకొచ్చిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.
సుడాన్లో తాజా పరిస్థితులపై అమెరికా సైతం ఆందోళన వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి: లాక్డౌన్ వద్దంటూ రోడ్డెక్కిన వేలాది మంది- పోలీసులతో ఘర్షణ