అంతర్జాతీయ వాణిజ్యానికి కీలక జలమార్గమైన ఈజిప్టులోని సూయిజ్ కాలువలో ఇరుక్కుపోయి వేల కోట్ల రూపాయల నష్టాన్ని కలుగజేసిన భారీ కంటైనర్ నౌక ఎవర్ గివెన్ తిరిగి తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి జాబిల్లి సాయం చేసింది. మానవాళి ప్రయత్నాలతో పాటు ప్రకృతి సాయం తోడవడం వల్లే నౌకాసౌధం ఎవర్‌గివెన్ కదిలొచ్చింది. నిండు పున్నమి ప్రభావంతో కాలువలో ఎగిసిన అలలు ఇసుకలో కూరుకున్న నౌకను నీటిపైకి లేపాయి.
ఇసుక తుపాను, బలమైన గాలుల కారణంగా గత మంగళవారం సూయిజ్ కాలువలో నౌక అడ్డం తిరిగి. దాని ముందుభాగంలో ఉన్న కొమ్ము ఇసుక, బంకమట్టిలో కూరుకుపోయింది. నౌకను తిరిగి నీటిపైకి తెచ్చేందుకు ఆరు రోజులుగా చేసిన ప్రయత్నాలు సోమవారం ఫలించాయి. నౌక చిక్కుకున్న చోట ఇసుక, బంకమట్టిని డ్రెడ్జర్ల ద్వారా తవ్వుతుండగా.. టగ్‌బోట్లు నౌకను కదిలించాయి. వీటికి సముద్రపు పోటు కూడా తోడవడం వల్ల అనుకున్నదానికంటే ముందుగానే ఎవర్‌గివెన్‌ను తిరిగి సాధారణ స్థితికి తీసుకురాగలిగారు.
పౌర్ణమి సాయపడింది..
నౌకను కదిలించే ప్రయత్నాల్లో పౌర్ణమి వల్ల ఏర్పడిన సముద్రపు పోటు అపారంగా సాయపడిందని సహాయక బృందాలు చెబుతున్నాయి. చంద్రుడి గురుత్వాకర్షణ వల్ల సముద్రంలో కెరటాలు, ఆటుపోట్లు ఏర్పడుతుంటాయి. సాధారణంగా పౌర్ణమి, అమావాస్య ఘడియల్లో అలల తీవ్రత విపరీతంగా ఉంటుంది. గత ఆదివారం పౌర్ణమి కావడం వల్ల సూయిజ్ కాలువలోనూ అలలు పోటెత్తాయి. ఈ పోటు ఎవర్ గివెన్ నీటిలో నుంచి బయటకు వచ్చేందుకు సాయపడింది. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఏర్పడిన సముద్రపు పోటు తమకు అద్భుతమైన సాయం చేసిందని, నౌకను బలంగా నెట్టిందని సహాయక బృందాలు తెలిపాయి. ఈ పోటు సమయంలో అలల శక్తి రెండు టగ్ బోట్లు లాగినంతదానికంటే ఎక్కువగా ఉందని వెల్లడించాయి. ఎవర్ గివెన్ మళ్లీ కదిలిందంటే దానికి చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి కూడా ఓ ప్రధాన కారణమేనని ఆ బృందాలు అంటున్నాయి.
నౌక నీటిపై తేలిన తర్వాత దాన్ని తిరిగి సాధారణ స్థితిలోకి తీసుకురావడం కూడా చాలా కష్టమైందని రెస్క్యూ టీం సంస్థ బొస్కాలిస్ వెస్ట్‌మినిస్టర్ సీఈఓ పీటర్ బెర్డోస్కీ అన్నారు. ఎందుకంటే ఎవర్‌గివెన్ కాలువకు ఉన్న మరో భాగానికి తాకకుండా టగ్‌బోట్ల సాయంతో దాన్ని నిలువుగా తీసుకురావాలి. లేదంటే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది. నౌకను సాధారణ స్థితికి తీసుకొచ్చే ఆ పది నిమిషాలు అందరిలోనూ టెన్షన్ ఎక్కువైందని పీటర్ తెలిపారు. మొత్తానికి తమ ప్రయత్నాలు ఫలించి.. నౌక కాలువలో ముందుకు కదిలిందని చెప్పారు.
రెండున్నర రోజుల సమయం
ఎవర్ గివెన్ కారణంగా సూయిజ్ కాలువలో వందలాది నౌకలు నిలిచిపోయాయి. ఇవన్నీ కాలువ దాటాలంటే కనీసం రెండున్నర రోజుల సమయం పడుతుందని, నాలుగు రోజుల తర్వాత జలమార్గం మళ్లీ సాధారణ స్థితికి వచ్చే అవకాశాలున్నాయని కెనాల్ అథారిటీ వర్గాలు వెల్లడించాయి. ఘటనా స్థలం నుంచి కదిలిన ఎవర్ గివెన్ తొలుత గ్రేట్ బిట్టర్ లేక్ యాంకర్ ప్రాంతానికి వెళ్లింది. అక్కడి నుంచి కాలువ దక్షిణ భాగంలోకి ప్రవేశించింది. దాని వెనుకే మిగతా నౌకలు కూడా తమ ప్రయణాన్ని ప్రారంభించాయి.
ఇవీ చదవండి : ఆపరేషన్ సూయిజ్ సక్సెస్- కదిలిన ఎవర్ గివెన్ నౌక