సోమాలియా రాజధాని మొగాదిషులో ఉగ్రమూక బీభత్సం సృష్టించింది. పోలీస్ అకాడమీ సమీపంలో ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఆఫ్రికాలోని ఉగ్రవాద సంస్థ అల్-షబాబ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందగా.. మరో 8 మంది క్షతగాత్రులు అయ్యారని సోమాలియా అధికార ప్రతినిధి సాదిఖ్ అదాన్ అలీ తెలిపారు. పోలీసులు వెళ్లే ఓ రెస్టారెంట్ లక్ష్యంగా ముష్కరులు ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు.
దక్షిణ, మధ్య సోమాలియా ప్రాంతాలను నియంత్రించే అత్యంత చురుకైన ముష్కర ముఠా అల్-షబాబ్. మొగాదిషు లక్ష్యంగా ఈ ఉగ్ర సంస్థ తరచూ దుశ్చర్యలకు పాల్పడుతోంది. సోమాలియాలో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఏడాదిలో అనేక సార్లు మోర్టార్ దాడులు జరిపింది. అమెరికా రాయబార కార్యాలయం ఆ ప్రాంతానికి సమీపంలోనే ఉంది.
అల్-ఖైదాకు చెందిన ఉగ్రసంస్థలు బాంబుదాడుల్లో తమ నైపుణ్యాల్ని మెరుగుపరుచుకుంటున్నాయని ఐక్యరాజ్య సమితి నిపుణలు ఇటవల హెచ్చరించడం గమనార్హం. సోమాలియాకు విధ్వంసాన్ని సృష్టించే పరికరాలను అమ్మాకాలు, సరఫరా చేయకూడదని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి గతవారమే నిర్ణయించింది. అంతలోనే మొగాదిషులో ఈ ఉగ్రదాడి జరిగింది.
ఇదీ చూడండి:ఇథియోపియాలో ఉగ్రదాడి-34మంది మృతి