సెంట్రల్ మాలీలోని తాత్కాలిక ఐక్యరాజ్య సమితి స్థావరంపై కాల్పులు జరిగాయి. ఈ దాడిలో సమితికి చెందిన 28 మంది శాంతి దూతలు గాయపడ్డారు. దుండగులు పక్కా ప్లాన్ ప్రకారమే దాడికి పాల్పడినట్లు ఐరాస అధికారి తెలిపారు. ఈ ఘటనను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. సమితిపై జరిగిన అత్యంత ఘోరమైన దాడిగా దీన్ని పరిగణిస్తున్నట్లు చెప్పారు. ఏ ఉగ్రసంస్థ ఈ ఘటనకు పాల్పడిందో తెలియాల్సి ఉంది.
ఈ సమితి సమావేశంలో సుమారు 12,500 మంది శాంతి దూతలు పాల్గొన్నారు. మరో 1,700 మంది అంతర్జాతీయ పోలీసు బలగాలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈ దాడి జరగడం వల్ల సభ్యుల భద్రతపై పలు అనుమానాలకు తావిస్తోంది.
ఈ ఏడాదిలో ఇలాంటి ఘటనలు చాలానే వెలుగు చూశాయి. వాటిలో ఇప్పటివరకు నలుగురు మరణించగా.. మరో 46 మంది గాయాలపాలయ్యారు. 2012 నుంచే మాలీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అధ్యక్షుడిని గద్దె దింపడానికి సైన్యం తిరుగుబాటు చేసింది. ఫలితంగా ఏర్పడిన అధికార లేమి.. చివరికి ఇస్లామిక్ తిరుగుబాటుకు, ఫ్రెంచ్ నేతృత్వంలో యుద్ధానికి దారితీసింది. ఇందులో అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రసంస్థలు ప్రభావం పెరిగింది. ఈ క్రమంలోనే గతేడాది ఆగస్టులో అధ్యక్షుడు ఇబ్రహీం బౌబాకర్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
మాలీలో నెలకొన్న రాజకీయ అనిశ్చితే ఇలాంటి దాడికి కారణం అని సమితి సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై సమితిలో చర్చించి.. ఉగ్రవాదం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ ఘటనపై మాలీ అధికారులు దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు.