Simhadri Ankitha Interview : 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో తెరంగేట్రం చేసి తొలి ప్రయత్నంలోనే తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు నటి అంకిత. ఆ తర్వాత 'ధనలక్ష్మీ.. ఐ లవ్ యూ', 'ప్రేమలో పావని కల్యాణ్' చిత్రాల్లో నటించి జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి 'సింహాద్రి' సినిమాలో సందడి చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో ఆమె సినీ కెరీర్ గ్రాఫ్ అనూహ్యంగా పెరిగిపోతుందని అంతా భావించారు. కానీ.. కథ అడ్డం తిరిగినట్లు ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమె సినిమాలకు దూరమయ్యారు. అందుకు గల కారణాన్ని ఆమె వివరించారు.
"'విజయేంద్రవర్మ' సినిమాపై నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా. అది నేను ఆశించిన స్థాయిలో ఫలితాన్ని మాత్రం ఇవ్వలేకపోయింది. ఆ చిత్రం సక్సెస్ అయి ఉంటే నేను ఇండస్ట్రీలో కొనసాగేదాన్ని" అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తేనే కెరీర్ సాఫీగా సాగిపోతుందంటూ అప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు.
ఆయనతో నాకేమీ లేదు..
ఈ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత విషయాలనూ కూడా షేర్ చేశారు. హీరో నవదీప్‌తో తనకు ఎలాంటి గొడవల్లేవని స్పష్టం చేశారు. నవదీప్ సరసన నటించిన చిత్రంతోపాటు తమిళంలో మరో సినిమా ఒకే సమయంలో చిత్రీకరణ జరుపుకోవడంతో కాస్త ఒత్తిడిగా ఫీలయ్యానని.. ఆ క్రమంలో అసహనానికి లోనవడమే తప్ప ఎలాంటి మనస్ఫర్థలు రాలేదన్నారు. నటి ఆర్తి అగర్వాల్, హీరో ఉదయ్ కిరణ్ తనకు మంచి మిత్రులని తెలిపారు. వారు ఇప్పుడు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. గతేడాది హీరో అల్లు అర్జున్‌ను కలిశానని చెప్పారు. ఎన్టీఆర్‌తో సోషల్ మీడియా వేదికగా టచ్‌లో ఉన్నానని తెలిపారు. అలాగే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు వీరాభిమానినని అన్నారు. మంచి అవకాశం వస్తే సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు.
ముంబయికి చెందిన అంకితకు వ్యాపారవేత్త విశాల్ జగపతితో 2016లో వివాహం జరిగింది. అనంతరం వారు అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. 2004లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'విజయేంద్రవర్మ' సినిమా తర్వాత అంకిత.. నవదీప్‌తో 'మనసు మాట వినదు', హీరో గోపీచంద్‌తో 'రారాజు' సినిమాల్లో నటించారు. మాస్మహారాజా రవితేజ 'ఖతర్నాక్' మూవీలోని సాంగ్‌లో ఆడిపాడారు. 2009 నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు.