Actor Krishnam Raju Died : తెలుగు చిత్రసీమలో 50 ఏళ్లకుపైగా హీరోగా, విలన్‌గా అలరించిన నటుడు కృష్ణంరాజు మరణంతో సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య సంతాపం..
రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. "కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ చలనచిత్ర నటులు శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు పరమపదించడం అత్యంత విచారకరం. మంచితనానికి మారుపేరుగా అనేకమంది అభిమానాన్ని సంపాదించుకున్న వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. వ్యక్తిగతంగా మంచి ఆప్తుణ్ని కోల్పోవడం బాధాకరమైన విషయం" అంటూ ట్వీట్ చేశారు.
మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు మరణం తీవ్రంగా కలిచివేసింది: బాలకృష్ణ
మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు మరణం తీవ్రంగా కలిచివేసిందని ప్రముఖ నటుడు బాలకృష్ణ తెలిపారు. "సినీ, రాజకీయ రంగాలలో కృష్ణంరాజు చెరగని ముద్ర. విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్‌గా శాశ్వత స్థానం సంపాదించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. కృష్ణంరాజుతో కలసి రెండు చిత్రాల్లో నటించడం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభవం. ఆయన ఫ్యామిలీతో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కృష్ణంరాజు అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నప్పుడు వెళ్లి కలిశాను. ఆయన ఆరోగ్యం గురించి తరచూ తెలుసుకునేవాడిని. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం." అంటూ బాలకృష్ణ సంతాపం తెలిపారు
మాటలు రావడం లేదు: మోహన్ బాబు
దిగ్గజ నటుడు కృష్ణంరాజు మృతి పట్ల సీనియర్ నటుడు మోహన్ బాబు విచారం వ్యక్తం చేశారు. సోదర సమానుడైన కృష్ణంరాజు మరణ వార్త విన్న తర్వాత మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు.
రెబల్ స్టార్‌కు ఆయన నిజమైన నిర్వచనం: చిరంజీవి
నటుడు కృష్ణంరాజు మృతి పట్ల హీరో చిరంజీవి సంతాపం తెలిపారు. "కృష్ణంరాజు గారు ఇక లేరు అనే మాట ఎంతో విషాదకరం. మా ఊరి హీరో, చిత్ర పరిశ్రమలో నా తొలి రోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజుగారితో నాటి మనవూరి పాండవులు దగ్గర్నుంచి నేటి వరకు నా అనుబంధం ఎంతో ఆత్మీయమైనది. ఆయన 'రెబల్ స్టార్'కు నిజమైన నిర్వజనం" అంటూ ట్వీట్ చేశారు.
చిత్రపరిశ్రమకు నేడు దుర్దినం: మహేశ్ బాబు
"కృష్ణంరాజు ఇకలేరన్న వార్త నన్ను షాక్‌కు గురిచేసింది. నిజంగా ఈ రోజు నాకు, చిత్ర పరిశ్రమకు దుర్దినం. ఆయన జీవితం, పని చేసిన విధానం, సినిమాకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రభాస్, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అంటూ హీరో మహేశ్ బాబు ట్వీట్ చేశారు.
కృష్ణంరాజు మృతి నిజంగా బాధాకరం: ఎన్టీఆర్
సీనియర్ నటుడు కృష్ణంరాజు మృతి పట్ల ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ "కృష్ణంరాజు మృతి నిజంగా బాధాకారం. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి" అని ట్వీట్ చేశారు.
కోలుకుంటారని భావించా.. : పవన్ కల్యాణ్
"తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పంథాను కలిగిన నటులు కృష్ణంరాజు. రౌద్ర రస ప్రధానమైన పాత్రలను ఎంతగా మెప్పించేవారో కరుణ రసంతో కూడిన పాత్రల్లోనూ అలాగే ఒదిగిపోయేవారు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందిన ఆయన తుదిశ్వాస విడిచారనే వార్త దిగ్భ్రాంతి కలిగించింది. ఇటీవలి కాలంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారని తెలిసినప్పుడు కోలుకుంటారనే భావించాను. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మా కుటుంబంతో కృష్ణంరాజు ఫ్యామిలీకి స్నేహ సంబంధాలు ఉన్నాయి. 1978లో మన వూరి పాండవులు చిత్రంలో ఆయనతో కలిసి అన్నయ్య చిరంజీవి నటించారు. మొగల్త్తూరు గ్రామవాసులు కావడంతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. సినీ జీవితంలోనూ, ప్రజా జీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా వారి అందించిన సేవలు మరువలేనివి. కృష్ణంరాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను" అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
కృష్ణంరాజు మృతి.. అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కృష్ణ
కృష్ణంరాజు మృతి పట్ల సీనియర్ నటుడు కృష్ణ సంతాపం తెలిపారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని విచారం వ్యక్తం చేశారు
కృష్ణంరాజు మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు: కేంద్ర మంత్రి అమిత్ షా
తెలుగు సినిమా దిగ్గజ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మరణించారని తెలిసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. బహుముఖ నటనతో కోట్లాది మంది హృదయాలను కృష్ణంరాజు గెలుచుకున్నారని, ఆయన మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటని అమిత్ షా తెలిపారు.
కృష్ణంరాజు మృతి తీవ్ర విచారకరం: ప్రధాని మోదీ
"సినీ నటుడు కృష్ణంరాజు మరణం తీవ్ర విచారకరం. ఆయన నటను, సృజన్మాతకతను, సినీ పరిశ్రమకు అందించిన సేవలను రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయి. రాజకీయ నాయకుడిగానూ ఆయన సేవలు ఆదర్శం, స్ఫూర్తిమంతం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను."-- ప్రధాని నరేంద్ర మోదీ