సాధారణంగా సీక్వెళ్లు, ఫ్రాంఛైజీ చిత్రాల్లో.. కథ లేదంటే పాత్ర రెండింటిలో ఏదో ఒకటి కొనసాగుతుంటుంది. కొన్నిసార్లు ఒకే కథ రెండు భాగాలుగానూ ప్రేక్షకుల ముందుకొస్తుంటుంది. 'బాహుబలి', 'కేజీఎఫ్' సిరీస్ చిత్రాలు ఈ కోవకు చెందినవే. అయితే మల్టీ యూనివర్స్ మూవీస్ వీటికి పూర్తిగా భిన్నమైనవి. వేర్వేరు కథల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన పాత్రలన్నీ.. ఒక సినిమాలో ఓ పాయింట్ దగ్గర కనెక్ట్ అవ్వడం.. అవన్నీ కలిసి ఓ లక్ష్యం కోసం పోరాడటం.. మల్టీవర్స్ చిత్రాల్లో కనిపిస్తుంటుంది. 'అవెంజర్స్'లో కనిపించే 'ఐరన్‌మ్యాన్', 'కెప్టెన్ అమెరికా', 'థోర్', 'హల్క్', 'బ్లాక్ విడో' వంటి సూపర్ హీరో పాత్రలన్నీ వేర్వేరు కథల ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనవే. మార్వెల్ కాల్పనిక ప్రపంచంలో పురుడుపోసుకున్న ఈ పాత్రలన్నీ.. 'అవెంజర్స్'లో ఒకే లక్ష్యం కోసం కలిసి పోరాడతాయి. ఇప్పుడిదే తరహా మల్టీ యూనివర్స్ కథలు భారతీయ సినీ పరిశ్రమలోనూ శ్రీకారం చుట్టుకుంటున్నాయి.
లోకేష్ కనగరాజ్ సినీ యూనివర్స్.. కార్తి 'ఖైదీ' చిత్రంతో తాను సృష్టిస్తున్న సరికొత్త మల్టీవర్స్‌కు శ్రీకారం చుట్టారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఈ కథా ప్రపంచంలో భాగంగానే కమల్‌హాసన్ 'విక్రమ్'ను తీసుకొచ్చి అందరినీ మెప్పించారు. ఈ రెండు సినిమాలూ డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగేవే. ఇప్పుడీ చిత్రాల్ని కనెక్ట్ చేస్తూనే ఓ భారీ మల్టీవర్స్ సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు లోకేష్. 'ఖైదీ' క్లైమాక్స్‌లో ఢిల్లీ పాత్రకు - ఆది శంకరుడి పాత్రకు మధ్య ఏం జరిగిందన్నది చూపించకుండా సస్పెన్స్ క్రియేట్ చేశారు. అలాగే 'విక్రమ్'లో సూర్యను రోలెక్స్ అనే విలన్‌గా ప్రవేశ పెట్టి కొనసాగింపు కథపై అంచనాలు పెంచేశారు. ఈ కథతోనూ ఢిల్లీ పాత్రకు లింక్ ఉన్నట్లు చూపించి ఆ అంచనాల్ని రెట్టింపు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడీ యూనివర్స్ నుంచి రానున్న 'ఖైదీ 2', 'విక్రమ్ 2' చిత్రాలపై అందరి దృష్టీ పడింది. ప్రస్తుతం విజయ్ - లోకేష్‌ల కలయికలో రూపొందుతోన్న చిత్రానికీ 'ఖైదీ', 'విక్రమ్' సినిమాలతో లింక్ ఉంటుందన్న ప్రచారం వినిపిస్తోంది. అదే నిజమైతే లోకేష్ మల్టీవర్స్ నుంచి వచ్చే ఆఖరి చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడతాయి.
ప్రశాంత్ నీల్ సినీ ప్రపంచంలోకి?.. 'కేజీఎఫ్' సిరీస్ చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సిరీస్ నుంచి 'కేజీఎఫ్ 3' కూడా రానున్నట్లు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతానికైతే ఆయన ప్రభాస్‌తో 'సలార్' చేస్తున్నారు. దీని తర్వాత ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రాలకు సంబంధించిన ప్రి లుక్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. అయితే వీటిని జాగ్రత్తగా గమనిస్తే.. 'కేజీఎఫ్' చిత్రాలకు త్వరలో రానున్న ఈ సినిమాలకీ ఏదో కనెక్షన్ ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రాల థీమ్ డార్క్ గ్రే కలర్‌తో కనిపిస్తుండటం.. హీరోలంతా రఫ్ లుక్స్‌లో కనిపించడం.. వీటి మధ్య ఏదో లింక్ ఉండనున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఇటీవల ఈ చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్ మాట్లాడుతూ.. తమ 'కేజీఎఫ్' ఫ్రాంఛైజీని మార్వెల్ యూనివర్స్‌లా అభివృద్ధి చేయాలనుకుంటున్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడీ సినిమాలన్నీ ప్రశాంత్ నీల్ మల్టీ యూనివర్స్‌లో భాగమన్న చర్చలు ఊపందుకున్నాయి. అయితే దీనిపై మరింత స్పష్టత రావాలంటే 'సలార్' వచ్చే వరకు వేచి చూడక తప్పదు.
'హిట్' మల్టీవర్స్‌తో నాని!.. 'హిట్' చిత్రంతో నిర్మాతగానూ హిట్ కొట్టారు కథానాయకుడు నాని. ఆయన ఈ సినిమాని ఓ ఫ్రాంఛైజీలా ముందుకు తీసుకెళ్లనున్నట్లు గతంలోనే ప్రకటించారు. దీనికి తగ్గట్లుగానే ఇప్పటికే 'హిట్ 2'ను సిద్ధం చేశారు. తొలి భాగాన్ని తెరకెక్కించిన శైలేష్ కొలను రెండో భాగానికీ దర్శకత్వం వహించారు. అయితే తొలి 'హిట్'లో విష్వక్‌సేన్ హీరోగా నటించగా.. రెండో 'హిట్'లో అడివి శేష్ కథానాయకుడిగా కనిపించనున్నారు. దీని వెనకున్న ఓ ఆసక్తికర విషయాన్ని తాజాగా విష్వక్ బయటపెట్టారు. ''హిట్ 2' కూడా నాతోనే చేద్దామనుకున్నారు. కానీ, కాల్షీట్లతో ఇబ్బంది వచ్చింది. అందుకే మరో హీరోతో 'హిట్ 2' చేస్తున్నారు. నాని అన్న కూడా.. ఒక్కో పార్ట్ ఒక్కో హీరోతో చేస్తే బాగుంటుందని అన్నాడు. అలా 'హిట్' ఫ్రాంఛైజీ ఎప్పుడొచ్చినా హీరో మారుతుంటాడు'' అని చెప్పుకొచ్చాడు విష్వక్. ఇలా చేయడం వెనుక నానికి ఓ మాస్టర్ ప్లాన్ ఉందట. ఆయన ఇలా హిట్ 2, 3, 4లలో చేసిన హీరోలందరినీ కలిపి ఓ భారీ సినిమా చేయాలని ప్రణాళిక రచిస్తున్నారని సమాచారం. అంటే ఒకరకంగా ఇది రానున్న రోజుల్లో 'హిట్' మల్టీవర్స్‌గా మారనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: ఆసక్తి రేకెత్తిస్తున్న 'చియాన్ 61' పోస్టర్.. మరోసారి ప్రయోగాత్మక పాత్రలో