యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 20 ఏళ్లలో 20 దేశాల్లో హీరోగా పేరు తెచ్చుకున్నారని సీనియర్ నటుడు కృష్ణంరాజు అన్నారు. 'ఈశ్వర్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ కెమెరా ముందుకొచ్చి నేటికి 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా కృష్ణంరాజు సమక్షంలో ఆయన నివాసంలో అభిమానులు కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు.
కృష్ణంరాజు మాట్లాడుతూ.. "ప్రభాస్ హీరోగా పరిచయం అయి అప్పుడే 20 ఏళ్ళు గడచిపోయాయా అన్న సందేహం కలుగుతుంది. అతడిని హీరోగా పరిచయం చేద్దామని ముందు మేమే అనుకున్నాం. మా గోపికృష్ణ బ్యానర్లో పరిచయం చేయాలని అనుకున్న తర్వాత ఒకరోజు నిర్మాత అశోక్ కుమార్, దర్శకుడు జయంత్ వచ్చి ప్రభాస్‌ను పరిచయం చేసే అవకాశం ఇవ్వమని అడిగారు. ఈశ్వర్ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. మంచి మాస్ ఎలిమెంట్స్ ఉండటం వల్ల అందరికీ బాగా నచ్చుతుందన్న నమ్మకంతో అశోక్ కుమార్‌కు ఓకే చెప్పాం. ఆ చిత్రం చూశాకా తప్పకుండా పెద్ద హీరో అవుతాడని అనుకున్నాం. కానీ ఎవరు ఊహించని విధంగా ఇలా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడంటే అతని శ్రమ, పట్టుదల ముఖ్యంగా మా అభిమానుల అండదండలు ఉండటమే కారణం. ఇదంతా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రభాస్ ఇంకా ఇలాగే మరింత ఎత్తుకు ఎదగాలని మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.
ఇదీ చూడండి: రామ్‌చరణ్ ఇంటికి బాలీవుడ్ స్టార్స్ క్యూ.. ఏంటి కథ?