బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ భార్య జైనాబ్ అలియాస్ ఆలియాపై ఆయన తల్లి మెహ్రునిసా సిద్ధిఖీ పోలీసు కేసు పెట్టారు. ఆస్తి తగాదా విషయంలో జైనాబ్‌పై ముంబయిలోని వెర్సోవా పోలీసులకు మెహ్రునిసా ఫిర్యాదు చేశారు. దీంతో వెర్సోవా పోలీసులు జైనాబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆమెను విచారణకు పిలిచారు.
నవాజుద్దీన్ సిద్ధిఖీ తల్లి మెహ్రునిసా, భార్య జైనాబ్ మధ్య ఆస్తి విషయంలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. అయితే, తాజాగా జైనాబ్ తనతో గొడవ పడిందని.. తనను దారుణంగా తిట్టిందని మెహ్రునిసా సిద్ధిఖీ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు వెర్సోవా పోలీసులు జైనాబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఐపీసీ పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
నవాజుద్దీన్ సిద్ధిఖీ, జైనాబ్‌లకు 2010లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొడుకు పేరు యాని సిద్ధిఖీ, కూతురు పేరు షోరా సిద్ధిఖీ. నవాజుద్దీన్‌కు జైనాబ్ రెండో భార్య. అయితే, నవాజుద్దీన్ నుంచి విడాకులు తీసుకోవడానికి 2020లో ఆయనకు జైనాబ్ లీగల్ నోటీసు పంపించారు. తాను గృహ హింసకు లోనవుతున్నానని.. అందుకే విడాకులు కావాలని నోటీసులో జైనాబ్ పేర్కొన్నారు. భర్త నవాజుద్దీన్ సిద్ధిఖీ ఏ రోజూ తనపై చేయి ఎత్తలేదని.. కానీ, ఆయన సోదరుడు షామస్ సిద్ధిఖీ తనను కొడుతున్నాడని ఆరోపించారు.
అయితే, 2021లో జైనాబ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. నవాజుద్దీన్‌తో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. గతంలో తన భర్త పిల్లలకు అస్సలు సమయం కేటాయించేవారు కాదని.. కానీ, ప్రస్తుతం ఆయన ప్రవర్తన చూసి తాను ఆశ్చర్యపోయానని అప్పట్లో మీడియాతో మాట్లాడుతూ జైనాబ్ చెప్పుకొచ్చారు. నవాజ్, తాన మధ్య ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకుని కలిసి జీవించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.