సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కాంతార'. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో, హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరాంగదుర్ దీన్ని నిర్మించారు. సెప్టెంబర్ 30న ఒక సాధారణ చిత్రంగా విడుదలైన ఈ సినిమా కన్నడలో రికార్డులు సృష్టించింది. అందరి నోట 'కాంతార' అనే వినబడుతోంది అంటే అతిశయోక్తి కాదు. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 188 కోట్లకు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.
కన్నడలో సెప్టెంబర్ చివర్లో రిలీజ్ అయిన 'కాంతార'.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు అద్భుతంగా ఉందని చెబుతున్నారు.
'కాంతార' భారతదేశంలో రూ.170 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.18 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.188 కోట్ల గ్రాస్‌తో.. యష్ నటించిన 'కెజీఎఫ్' తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన కన్నడ చిత్రంగా రెండో స్థానంలో నిలిచింది. దీపావళి.. వీకెండ్ కలిసి రావడం వల్ల ఈ సినిమా కలెక్షన్ల జోరు పెరిగింది.
ఈ సినిమా మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లు రూ.170 కోట్లకు చేరుకున్నాయి. నాలుగో వారం ముగిసేసరికి రూ.200 కోట్ల మార్కును దాటే అవకాశముందని తెలుస్తోంది. 'కాంతార' కన్నడలో ఇప్పటి వరకు సుమారుగా రూ. 111 కోట్లు వసూలు చేసింది. ఒక్క వారాంతంలోనే రూ.14 కోట్లు రాబట్టింది. ఈ సమయానికి 'కెజీఎఫ్ 2' కలెక్షన్లతో పోల్చుకుంటే ఇది రెట్టింపు.
ఇంతకముందే ఈ సినిమా.. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ 'ఆర్‌ఆర్‌ఆర్', 'కేజీయఫ్-2' రికార్డులను బ్రేక్ చేసింది. ఐఎండీబీలో 8.4 రేటింగ్‌తో 'కేజీయఫ్-2', 8 రేటింగ్‌తో 'ఆర్‌ఆర్‌ఆర్' ఉండగా.. ఇప్పుడు 'కాంతార' 9.5 రేటింగ్‌తో అదరగొట్టింది. దీంతో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రంగా పేరు సొంతం చేసుకుంది. 'కాంతార'కు అసాధారణమైన రేటింగ్ రావడంపై కన్నడ సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి : 'విక్రమ్' టు 'కాంతారా'.. ఈ థీమ్ సాంగ్స్ సూపర్ హిట్.. మీరు విన్నారా?