kamal haasan project k : ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె'లో నటించడంపై హర్షం వ్యక్తం చేశారు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. తాను, నిర్మాత అశ్వినీ దత్ కెరీర్ ప్రారంభించిన దాదాపు 50 ఏళ్ల తర్వాత కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని అన్నారు. అలాగే గత జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు.
"50 ఏళ్ల క్రితం నేను డ్యాన్స్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాను. అప్పుడు సినీ నిర్మాణంలో అశ్వినీ దత్ పేరు ఎక్కువగా వినిపిస్తుండేది. ఇప్పుడు 50ఏళ్ల తర్వాత మేమిద్దరం కలిసి 'ప్రాజెక్ట్ కె' కోసం పనిచేయబోతున్నాం. నాగ్ అశ్విన్ నవ తరం దర్శకుడు. టాలెంటెడ్ పర్సన్. నా కో స్టార్స్ ప్రభాస్, దీపికా పదుకొణె కూడా ప్రతిభావంతులు. ఇక నేనూ అమితాబ్ బచ్చన్ గతంలోనే కలిసి పని చేశాం. కానీ, ఎప్పుడూ కొత్తగా అనిపిస్తుంది. సినిమా సినిమాకీ అమితాబ్ తనని తాను కొత్తగా మలుచుకుంటారు. నేనూ కూడా అంతే. ఈ సినిమా షూటింగ్ కోసం ఎంతో ఇంట్రెస్ట్‌గా ఉన్నా. ప్రేక్షకులు నాకు ఎలాంటి స్థానాన్ని ఇచ్చినా.. నేను మాత్రం సినీ ప్రేమికుడిని. ఇండస్ట్రీలో ఏ కొత్త ప్రయత్నమైనా ఎప్పుడూ మెచ్చుకుంటూనే ఉంటాను. ఈ ప్రాజెక్ట్ కె విషయంలో తొలి ప్రశంస నాదే. దేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరినీ.. నాగ్ అశ్విన్ విజన్ చప్పట్లు కొట్టేలా చేస్తుంది" అని కమల్ హాసన్ పేర్కొన్నారు.
kamal haasan telugu movies : 28 ఏళ్ల తర్వాత తెలుగులో.. కమల్ హాసన్ నేరుగా తెలుగు చిత్రంలో నటించి 28 ఏళ్లు అయింది. 1976లో 'అంతులేని కథ'లోని గెస్ట్ రోల్ చేశారు. ఆ తర్వాత తెలుగులో తక్కువ సినిమాలు చేశారు. 'వయసు పిలిచింది', 'సొమ్మొకడది సోకొకడిది', 'ఇది కథ కాదు' వంటి రీమేక్ చిత్రాలతో నటించారు. 'సాగర సంగమం', 'స్వాతిముత్యం' వంటి స్ట్రైట్ మూవీస్ చేసి మంచి పేరు దక్కించుకున్నారు. ఆయన నేరుగా తెలుగులో నటించిన చివరి చిత్రం.. 'శుభ సంకల్పం'(1995). గతేడాది 'విక్రమ్'తో దేశవ్యాప్తంగా ఘన విజయం అందుకున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'ఇండియన్ 2' చేస్తున్నారు.
nag ashwin project k : 'మహానటి' తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేస్తున్న సినిమా 'ప్రాజెక్ట్ కె'. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతోంది. దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సహకారం అందిస్తున్నారు. ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ నటించడంతో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. దిశా పటానీ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక కమల్ హాసన్ నటించనున్నారని తెలియగానే.. 'ప్రాజెక్ట్ కె'పై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటివరకు దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తైంది.
ఇదీ చూడండి :