Bhumi Pednekar Trolls : బాలీవుడ్ భామ భూమి పెడ్నేకర్.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకొని అభిమానులను సొంతం చేసుకున్నారు. బీటౌన్‌లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆమె చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా మారారు. ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాల్లో మెరిసి అభిమానులను పలకరించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్‌పై స్పందించారు. నటీనటులపై కామెంట్లు చేయడానికి ఒక వర్గానికి చెందిన నెటిజన్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
"ఈ రోజుల్లో ట్రోలింగ్ సాధారణమైపోయింది. ఏం చేసినా మనల్ని జనాలు ట్రోల్ చేస్తుంటారు. పండగ రోజుల్లో నేను సంప్రదాయ దుస్తులు ధరించి ఫొటోలు పంచుకున్నా కూడా విమర్శిస్తారు. సినిమా ప్రమోషన్ల సమయాల్లో ఉన్నట్లు కనిపించడం లేదని అంటుంటారు. ఇంతకుముందు మన దుస్తుల గురించి ఇంట్లో వాళ్లు మాత్రమే మాట్లాడేవారు. ఇప్పుడు వాటి గురించి అందరూ అడగటం ప్రారంభించారు. ఇక నా డ్రెస్సింగ్‌పై చిన్నప్పటి నుంచి నేను విమర్శలు ఎదుర్కొన్నాను. 'పొట్టి దుస్తులు ఎందుకు వేసుకుంటున్నావు' అని చాలా మంది ప్రశ్నించేవాళ్లు. అలా ట్రోల్ చేసేవాళ్లే మళ్లీ సంస్కృతిని కాపాడాలని మాట్లాడతారు. కానీ, మన గురించి అభిప్రాయాలు పంచుకునేందుకు అసహ్యకరమైన భాషను ఉపయోగిస్తుంటారు. స్త్రీలను గౌరవించడం, వారితో మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం అనేది మన సంస్కృతిలో ఉంది. కానీ, వాళ్లు మాట్లాడే విధానం చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. వాటిని చదవాలన్నా చాలా ధైర్యం అవసరం. అందుకే అటువంటి ట్రోల్స్‌ను నేను పట్టించుకోను" అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
Bhumi Pednekar Movies : ఇక భూమి ప్రస్తుతం 'థాంక్యూ ఫర్ కమింగ్' అనే సినిమాలో నటించారు. అడల్ట్ కామెడీగా రూపొందిన సినిమా అక్టోబర్ 6న థియేటర్లలో విడుదల కానుంది. ఇదే కాకుండా 'భీడ్', 'అఫ్వా', 'మేరి హస్బండ్ కీ బివీ' అనే సినిమాల్లోనూ మెరిశారు. భూమి గతంలో సోషల్ మెసేజ్‌లు ఉన్న సినిమాల్లో నటించారు. 'బధాయి దో', 'దమ్ లగాకే హైసా', 'టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ' లాంటి సినిమాల్లో నటించి ప్రశంసలు అందుకున్నారు.