Ayushman Khurana Father Passes Away : చిత్రసీమలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. తాజాగా బాలీవుడ్‌లో విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్న ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానా తండ్రి వీరేంద్ర ఖురానా అలియాస్ పండిత్ పీ ఖురానా తీవ్ర గుండెపోటుతో కన్నుమూశారు. గత రెండు రోజులుగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో బాలీవుడ్ చిత్రసీమ శోక సంద్రంలో మునిగిపోయింది. పండిత్ పీ ఖూరానా మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయుష్మాన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానూభూతి తెలుపుతున్నారు.
పండిత్ వీరేంద్ర ఖురానా ప్రముఖ అస్ట్రాలజర్‌గా చాలా ఫేమస్. ఆయన జ్యోతిష్యంపైన ఎన్నో అద్భుత రచనలు కూడా చేశారు. అంతేకాదు ఎంతో మంది బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్‌తో పాటు దర్శక, నిర్మాతలకు ఈయన దగ్గరకు తరచూ వెళ్తుంటారు. బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలకు ఈయన ముహూర్తం పెడుతూ ఉంటారు. అలా చిత్రసీమకు దగ్గరయ్యారు. ఆ పరిచయంతోనే తన ఇద్దరు కుమారులను సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టించారు.
ఆయుష్మాన్ ఖురానా కెరీర్ విషయానికొస్తే.. ముందుగా ఎంటీవీ వీడియో జాకీగా పనిచేసిన ఆయన 'విక్కీ డానర్' సినిమాతో హీరోగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నటుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంధాదున్ సినిమాలోని నటనకు గాను విక్కీ కౌశల్‌తో కలిపి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. ఆయన తమ్ముడు అపర్ శక్తి ఖురానా కూడా నటుడే. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన జూబ్లీ వెబ్ సిరీస్‌లో తన నటనతో అపర్ ఆకట్టుకున్నారు.
యశ్ చోప్రా భార్య కన్నుమూత
గతనెలలో ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత దివంగత యశ్ చోప్రా భార్య పమేలా చోప్రా కన్నుమూశారు. 74 ఏళ్ల పమేలా.. 15 రోజులుగా ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. యశ్ చోప్రా సతీమణి అయినప్పటికీ.. పమేలా చోప్రా ప్లే బ్యాక్ సింగర్‌గా మంచి గుర్తింపు పొందారు. ఆమె సినీ రచయిత, నిర్మాత కూడా. పమేలా 1970లో యశ్ చోప్రాను వివాహం చేసుకున్నారు. పమేలా చోప్రా చివరిసారిగా 'ది రొమాంటిక్స్' అనే డాక్యుమెంటరీలో కనిపించారు.
అందులో తన భర్త యశ్ చోప్రా, ఆయన ప్రయాణం గురించి మాట్లాడారు. యశ్ చోప్రా 2012లో మృతిచెందారు. వీరికి ఇద్దరు కుమారులు ఆదిత్య చోప్రా, ఉదయ్ చోప్రా. పెద్ద కుమారుడు ఆదిత్య చోప్రా.. సినిమాలకు దర్శక, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈయన బాలీవుడ్ నటి రాణి ముఖర్జీని వివాహం చేసుకున్నారు. చిన్న కుమారుడు ఉదయ్ చోప్రా కూడా సినీ రంగంలో ఉన్నారు. యశ్ రాజ్ ఫిల్మ్ నిర్మించిన 'ధూమ్' సిరీస్‌లో అలీఖాన్ అనే పాత్రలో నటించిన ఈయన ప్రేక్షకులకు సుపరిచితుడే. అంతే కాకుండా ప్యార్ ఇంపాజిబుల్, ముజ్సే దోస్తీ కరోగే లాంటి సినిమాల్లోనూ నటించారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే ఉదయ్.. పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.