Alluarjun Varuntej Gani movie pre release event: వరుణ్ తేజ్ కథానాయకుడిగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన చిత్రం 'గని'. అల్లు బాబీ, సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. సయీ మంజ్రేకర్ కథానాయిక. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం విశాఖపట్నంలో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు.
దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లు అర్జున్ మాట్లాడుతూ.. "ఈ సినిమాతో మా అన్నయ్య అల్లు బాబీ నిర్మాతగా మారుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి వరుణ్ అంటే నాకు చాలా ఇష్టం. తను సినిమాల్లోకి వచ్చాక తనపై మరింత గౌరవం పెరిగింది. తను ఈ చిత్రం కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. తన కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది. సినిమా చూశా. చాలా బాగుంది " అని అన్నారు.
"మూడేళ్లు ఎంతో కష్టపడి.. ఈ చిత్రాన్ని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాతలు. సినిమా చూశా. చాలా ఎమోషనల్‌గా ఉంది. కిరణ్ అద్భుతంగా తీశాడ"న్నారు. నిర్మాత అల్లు అరవింద్. హరీష్ శంకర్ మాట్లాడుతూ.. "ఈ చిత్రంతో కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. పాటలు విన్నా. తమన్ ఇరగదీశాడు. వరుణ్ ఈ చిత్రం కోసం ఎంత నిబద్ధతతో పనిచేశాడో స్వయంగా చూశాను. అది తెరపైనా కనిపిస్తుంది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించి.. టైటిల్‌కు తగ్గట్లుగా నిర్మాతలకు డబ్బుల గనిగా మారాలని కోరుకుంటున్నా’" అన్నారు.
దర్శకుడు కిరణ్ కొర్రపాటి మాట్లాడుతూ.. "మూడేళ్ల కల.. కష్టం.. ఒకరి నమ్మకం.. ఈ చిత్రం. నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చినందుకు వరుణ్‌కు థ్యాంక్స్. పవన్ కల్యాణ్‌కు 'తమ్ముడు'లా.. వరుణ్ తేజ్‌కు 'గని' ఓ మైలురాయిలా నిలుస్తుంది" అన్నారు. ఈ కార్యక్రమంలో సయీ మంజ్రేకర్, నవీన్ చంద్ర, నరేశ్, రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. "కొవిడ్ వల్ల చాలా ఇబ్బందులెదుర్కొన్నాం. ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలన్న లక్ష్యంతోనే కష్టపడుతూ.. ఇంత వరకు తీసుకొచ్చాం. పవన్ కల్యాణ్ బాబాయ్ ‘తమ్ముడు’ చిత్ర స్ఫూర్తితోనే ఈ సినిమా చేశాను. కచ్చితంగా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా" అన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: హీరోయిన్ కారుకు ప్రమాదం - అపోలోకు తరలింపు