2021లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించిన పుష్ప సినిమా.. పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా ఇందులో అల్లు అర్జున్ లుక్‌తో పాటు ఆయన యాస అభిమానులను బాగా ఆకర్షించింది. ఎటువంటి ప్రమోషన్లు లేకుండానే బాలీవుడ్‌లో రిలీజైన ఈ చిత్రం.. ఏకంగా రూ.100 కోట్లు మేర వసూళ్లు సంచలనం సృష్టించింది. ఈ సినిమాలోని పాత్రలతో పాటు డైలాగ్స్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. 'పుష్ప అంటే ఫైర్', 'తగ్గేదే లే' డైలాగ్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.
అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప ద రూల్ తెరకెక్కుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు పలు చోట్ల శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్.. బర్త్ డే(ఏప్రిల్ 8) నాడు ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇవ్వనున్నారట మేకర్స్. మూడు నిమిషాల పాటు సాగే టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నారట. ఇందులో ఎలాంటి మాటలు ఉండవట. కేవలం యాక్షన్ సీక్వెన్స్, ఎలివేషన్ షాట్స్ మాత్రమే ఉంటాయట. అన్ని భాషలకు రీచ్ అవ్వాలని ఇలా ప్లాన్ చేశారట.
ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఎట్టకేలకు సినిమాకు సంబంధించి అప్డేట్ రానుండడంతో సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్‌మీడియాలో ట్రెండ్ చేసి హోరెత్తిస్తున్నారు. అయితే పుష్ప మొదటి పార్ట్ సమయంలోనూ ఇలానే ఓ యాక్షన్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఇప్పుడు కూడా మేకర్స్.. అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.
పుష్ప తొలి భాగం రిలీజ్ అయ్యి ఏడాదికి పైగా అయిపోతోంది. కానీ సీక్వెల్‌కు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. మొదటి పార్ట్ ఎవ్వరూ ఊహించినంత హిట్ అవ్వడం, పాన్ ఇండియా క్రేజ్ రావడంతో సీక్వెల్‌లో కీలక మార్పులు చేర్పులు చేసినట్టుగా తెలుస్తోంది. మరింత పవర్ ఫుల్‌గా స్క్రిప్ట్‌ను సుకుమార్ రెడీ చేసినట్టు అనిపిస్తోంది. అందుకే సినిమా షూటింగ్‌ను ఇంత ఆలస్యంగా మొదలపెట్టారట.
మరోవైపు, ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది ఈ సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు కోట్లు కురిపిస్తోందట! థియేట్రికల్ రైట్స్ ద్వారా ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలను వసూలు చేసిందట. అయితే ఈ విషయంపై ఎక్కడా కూడా అధికారికంగా ఎటువంటి సమాచారం వెలువడలేదు.
కాగా, పుష్ప - ది రైజ్ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.400 కోట్లు వసూలు చేసింది 2021లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా రికార్డుకెక్కింది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా తెరకెక్కించిన సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక నటించారు. సునీల్, ఫహాద్ ఫాజిల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించారు.