ALIA BHAT: ప్రస్తుతం బాలీవుడ్‌ని బాయ్‌కాట్ సెగ దహించి వేస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం సమయంలో బాలీవుడ్ మాఫియా, నెపోటిజంపై విమర్శలు వెల్లువెత్తగా, ఆమిర్‌ఖాన్ లాల్‌సింగ్‌చడ్డా విడుదల సమయంలో నిప్పురవ్వలా మొదలైన బాయ్‌కాట్ ట్రెండ్ కార్చిచ్చులా మారి, ఆ సినిమా వసూళ్లపై తీవ్ర ప్రభావాన్నే చూపింది. ఇక ఆ చిత్ర కథానాయిక కరీనాకపూర్ ఇష్టం లేకపోతే సినిమా చూడటం మానేయండి అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారమే రేపాయి. ఆ తర్వాత తప్పు తప్పు అంటూ లెంపలేసుకున్నా, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఇదే విషయంలో అలియా కూడా నోరు జారడంతో ట్రోలింగ్ ఇటువైపు మళ్లింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవల అలియా భట్ ఓ ఆంగ్ల మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ క్రమంలో నెపోటిజం, బాయ్‌కాట్ ట్రెండ్‌పై స్పందించింది.
"ఫలనా కుటుంబంలో పుట్టాలని నేను కోరుకొని జన్మించానా? సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల్లో పుడితే, తొలి సినిమా వరకే అది ఉపయోగపడుతుంది. అసలు ఆ కుటుంబంలోనే పుట్టడం తప్పంటే ఎలా? మీకు నేను ఇష్టంలేకపోతే నన్ను చూడొద్దు. నేనేమీ చేయలేను" అంటూ తనదైన శైలిలో కాస్త ఘాటుగానే మాట్లాడింది. సోషల్‌మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో అలియాపై నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. అలియా నటించిన తదుపరి చిత్రాలేవీ చూడొద్దంటూ ట్వీట్లు పెడుతున్నారు. ఆమె కోరికను మనం మన్నిద్దాం. బ్రహ్మాస్త్ర రూ.500కోట్ల ఫ్లాప్‌బస్టర్ చేద్దాం. మనం వాళ్లకు కేవలం టికెట్లలాంటి వాళ్లం మాత్రమే. వాళ్లకు మీ (ప్రేక్షకుల) డబ్బులు మాత్రమే కావాలి. మీరు అవసరం లేదు" అంటూ ట్రోల్ చేయడం ప్రారంభించారు.
ఇప్పటికే బాలీవుడ్‌లో బాయ్‌కాట్ ట్రెండ్ కొనసాగుతుండగా, అలియా మాటల వల్ల ఇప్పుడు ఆ సెగ బ్రహ్మాస్త్ర కు తగిలేలా ఉంది. ఈ సినిమా మొత్తం మూడు భాగాల్లో రానుంది. తొలి భాగం శివను సెప్టెంబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రణ్‌బీర్, అలియా, నాగార్జున, అమితాబ్ ఇలా పెద్ద తారలే నటిస్తున్నారు. మొత్తంగా రూ.500కోట్ల ప్రాజెక్టు ఇది. ఇంత పెద్ద సినిమా విడుదల ముందు అలియా మాటలు ఆ చిత్ర యూనిట్‌కు తలనొప్పిగా మారాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో నెలకొన్న పరిస్థితులు చూసి కూడా అలియా ఇలా మాట్లాడటం సరికాదని చిత్ర వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండటంతో ఇది మరుగున పడుతుందా? లేక నివురుగప్పిన నిప్పులా ఉండి, బ్రహ్మాస్త్రకు సెగ తగులుతుందా? చూడాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి