Actor Upendra Case : కన్నడ నటుడు, ఉత్తమ ప్రజాకీయ పార్టీ వ్యవస్థాపకులు ఉపేంద్రపై కేసు నమోదైంది. సోషల్ మీడియా వేదికగా ఓ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదుతో.. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు బెంగళూరు సౌత్ డీసీపీ కృష్ణకాంత్ తెలిపారు. అనంతరం నటుడు ఉపేంద్ర ఈ వివాదంపై సంబంధిత వర్గానికి క్షమాపణలు చెప్పారు.
ఇదీ జరిగింది..
నటుడు ఉపేంద్ర.. శనివారం 'ఉత్తమ ప్రజాకీయ పార్టీ' ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో లైవ్ నిర్వహించారు. కాగా ఈ లైవ్లో ఉపేంద్ర మాట్లాడిన మాటలు.. ఓ సామాజిక వర్గ ప్రజల మనోభావాలు దెబ్బతిశాయి. దీనిపై సంబంధింత వర్గ ప్రజలు ఆదివారం ఉపేంద్రపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుపై స్పందించిన స్థానిక పోలీసులు.. చెన్నమ్మన కెరె అచ్చుకట్టు పోలీస్ స్టేషన్లో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఈ వివాదానికి దారి తీసిన వ్యాఖ్యలపై స్పందించిన నటుడు ఉపేంద్ర సంబంధిత వర్గ ప్రజలను క్షమాపణలు కోరారు. "ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లైవ్లో నేను ఉపయోగించిన సామెత వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసింది. దీంతో వెంటనే ఆ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాను. ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. జరిగిందానికి క్షమాపణలు కోరుతున్నాను" అని ఉపేంద్ర అన్నారు. కాగా 2017లో ఉపేంద్ర రాజకీయల్లోకి ప్రవేశించారు. ఆయన మొదటగా 'కర్ణాటక ప్రజ్ఞవంత జనతా పక్ష పార్టీ' లో చేరారు. అనంతరం కొన్ని కారణాల వల్ల ఆ పార్టీని వీడారు. 2018లో స్వయంగా 'ఉత్తమ ప్రజాకీయ పార్టీ' ని స్థాపించారు.
కాగా ఉపేంద్ర.. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాల్లో హీరోగా నటించారు. కొన్ని సినిమాలకు దర్శకుడిగానూ పనిచేశారు. కెరీర్ ప్రారంభం నుంచే భిన్నమైన పాత్రలు, సినిమాలు చేస్తూ.. అభిమానుల్లో ఓ ప్రత్యేకమైన ముద్ర వేశారు. ఇక 2015లో విడుదలైన 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో హీరోయిన్ నిత్యామేనన్కు అన్నయ్య పాత్రలో నటించారు. చాలా రోజుల నుంచి సరైన హిట్ అందుకోని ఉపేంద్ర.. రీసెంట్గా 'కబ్జా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా తెలుగు ఆడియోన్స్ను అంతగా మెప్పించలేకపోయింది.