సార్వత్రిక సమరంలో తొలిసారి అరంగేట్రం చేసిన కొంతమంది సత్తాచాటారు. వీరిలో మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, భాజపా నేత రవిశంకర్ ప్రసాద్, సూఫీ గాయకుడు హన్స్ రాజ్ హన్స్, బంగాలీ నటి మిమీ చక్రవర్తి తదితరులు ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో వీరు విజయదుందుభి మోగించారు.
తొలిసారి లోక్‌సభకు వెళ్తుంది వీరే...
- భాజపా తరఫున తూర్పు దిల్లీ నుంచి పోటీ చేసిన గంభీర్ కాంగ్రెస్ నేత అర్విందర్ సింగ్‌పై విజయం సాధించారు. దాదాపు 3.91 లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో గెలిచి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు.
- ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న భాజపా నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి శతృఘ్న సిన్హాపై 2.84 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
- వాయువ్య దిల్లీ నుంచి గాయకుడు హన్స్ రాజ్ గెలుపొందారు. ఆప్ నేత గుగాన్ సింగ్‌పై 5.55లక్షల తేడాతో గెలిచారు.
- బంగాలీ నటి మిమీ చక్రవర్తి తృణమూల్ కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. భాజపా నేత అనుపమ్ హజ్రాపై 2.95 లక్షల మెజార్టీ దక్కింది.
- మరో బంగాలీ నటి, తృణమూల్ అభ్యర్థి నుస్రాత్ జహాన్ రూహీ.. భాజపా అభ్యర్థి సాయంతాన్ బసుపై గెలిచారు.
- ఉత్తర్‌ప్రదేశ్ మంత్రి సత్యదేవ్ పచౌరీ తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాన్పుర్ నుంచి బరిలో దిగి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీప్రకాశ్ జైస్వాల్‌పై 1.51లక్షల మెజార్టీతో నెగ్గారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఇదే అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు పచౌరీ.
- అలహాబాద్ నుంచి బరిలో దిగిన భాజపా అభ్యర్థి రీతా బహుగుణ జోషి గెలుపొందారు. అలాగే ఫూల్పుర్ నుంచి పోటీ చేసిన దేవి పటేల్ కూడా విజయం సాధించారు.