youngsters attack on lady: హైదరాబాద్ నగరంలో ఓ పబ్‌కు వెళ్లిన యువతిని పోకిరీలు వేధింపులకు గురి చేశారు. వాళ్లను ప్రతిఘటించి కారులో వెళుతున్న యువతిని వదలిపెట్టకుండా వెంబడించారు. పోకిరీలను తప్పుదోవపట్టించి... చివరికి తప్పించుకుంది. ఇదేదో సినిమాలో హీరోయిన్‌కు ఎదురయ్యే సంఘటన అనుకుంటే పొరపాటే. నిజానికి.. సినిమాల్లో తరచూ వచ్చే సన్నివేశాన్ని తలపించేలా ఉన్న ఈ ఘటన.. వాస్తవంగానే జరిగింది.
అసలు కథలోకి వెళ్తే..?
జూబ్లీహిల్స్‌లో ఉన్న క్లబ్ రోగ్ పబ్‌కు బాధిత యువతి స్నేహితులతో కలిసి వెళ్లింది. కాసేపు స్నేహితులతో సరదాగా గడిపిన యువతి.. ఇంటికి వెళ్లేందుకు బయటకు వచ్చింది. పబ్‌కు సంబంధించిన వాలెట్ పార్కింగ్‌లో కారు కోసం చూస్తున్న యువతిని అక్కడే ఉన్న కొందరు పోకిరీలు గమనించారు. యువతిని అసభ్యకరంగా దూషించారు. వెంటనే ప్రతిఘటించిన యువతి.. "మీరెవరు..?" అని ఆరా తీసింది. వెంటనే తీరు మార్చిన పోకిరీలు.. కార్లు ఎక్స్చేంజ్ చేసుకుందా..? అంటూ మాటలు కలిపారు. మళ్లీ అంతలోనే కారు తగలబెడతామని బెదిరించారు.
చాకచక్యంగా తప్పించుకుని..
ఈ వ్యవహారమేదో తేడాగా ఉందని గ్రహించిన యువతి.. పోకిరీల నుంచి చాకచక్యంగా తప్పించుకుంది. కారులో ఇంటికి పయనమైంది. అయినా వదలని పోకిరీలు.. ఆమె కారును వెంబడించారు. కొంత దూరం తర్వాత.. యువకులను తప్పుదోవ పట్టించి వాళ్ల నుంచి తప్పించుకుంది. వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధిత యువతి ఉన్నత పదవిలో ఉన్నట్లుగా సమాచారం.
ఇదీ చూడండి: