Mee Seva Employee Murder case: నా పేరు శివ.. ఈ సినిమా పేరు వింటేనే ఇద్దరు ప్రేమికులను దారుణంగా చంపి.. ముక్కలు ముక్కలు చేసి పలు చోట్ల విసిరేసిన ఘటనలు గుర్తొస్తాయి. ఆ సన్నివేశాలు తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇదే తరహా ఘటన నిజ జీవితంలోనూ జరిగింది. వివాహేతర సంబంధం మోజులో పడి ప్రియురాలి భర్తను దారుణంగా హత్య చేసి శవాన్ని ఏడుముక్కలు చేసి.. సినీఫక్కీలో మాయం చేద్దామని పోలీసులకు దొరికిపోయాడు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చెందిన ఓ ప్రబుద్ధుడు. పూటుగా మద్యం తాగించి తలపై బీరుబాటిల్‌తో కొట్టి హత్య చేసి మృతుడి శరీర అవయవాలను గతంలో తాను చూసిన సినిమా డిటెక్టివ్, నా పేరు శివ సినిమాలు, ఫ్యామిలీ మ్యాన్ 2 తరహాలో ముక్కలు ముక్కలు చేసి మాయం చేశాడు. తన కుమారుడు కనిపించడం లేదనే మృతుడి తల్లి ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులకు.. మల్యాలపల్లి వద్ద ఓ వ్యక్తి తలతో పాటు రెండు చేతులు లభించడంతో దర్యాప్తు ప్రారంభించారు. ఎట్టకేలకు ఆ ప్రియుడిని పట్టుకున్నారు.
కుమారుడు కనిపించడం లేదనే ఫిర్యాదుతో
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని ఖాజీపల్లికి చెందిన కాంపెల్లి పోచమ్మ ఈనెల 26వ తేదీన తన కుమారుడు శంకర్ కనిపించడం లేదని.. మీ సేవ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడని ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు తల, చెయ్యి భాగాలు(murder in peddapalli district) ఎన్టీపీసీ కూలింగ్ టవర్స్ వెనుక పడి ఉన్నాయనే సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న పోలీసులు శవ పంచనామా నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎన్టీపీసీ ధన్వంతరి ఆస్పత్రిలో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్న మృతుడి భార్య హేమలత.. అక్కడే పనిచేసే స్వీపర్ పాయిల రాజుతో వివాహేతర సంబంధం పెట్టుకుందని దర్యాప్తులో తేలింది. దీంతో వారిపై హత్య కేసు నమోదు చేశారు.
మల్యాలపల్లి చౌరస్తా వద్ద శరీర భాగాలు ఉన్నాయనే సమాచారం అందింది. దర్యాప్తు చేస్తే అది కాంపల్ల శంకర్‌ది అని తేలింది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాం. వివాహేతర సంబంధం గురించి ఆరా తీయడానికి వెళ్లిన శంకర్‌ను.. రాజు మద్యం తాగించి తాను వేసుకున్న పథకం ప్రకారం బీరు సీసాతో కొట్టాడు. అనంతరం కత్తులతో చంపాడు. ఎవరికీ దొరక్కుండా ఉండాలని సినీ ఫక్కీలో 7 భాగాలుగా నరికాడు. వాటిని వేర్వేరు చోట్ల పడేశాడు. - చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం సీపీ
నేరం చేసి పారిపోతుండగా
హత్య కేసులో నిందితుల గాలింపు చర్యల్లో భాగంగా.. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు పాయిల రాజు కరీంనగర్‌కు పారిపోతూ తెలంగాణ పవర్ ప్రాజెక్ట్ చౌరస్తా వద్ద పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణలో నేరం ఒప్పుకున్నాడు. నిందితుడు రాజు తన చిన్నతనంలోనే తల్లితండులను కోల్పోయాడని.. పదో తరగతి వరకే చదివాడని విచారణలో తేలింది. 2014లో కుందనపల్లికి చెందిన సంధ్యారాణితో అతనికి వివాహం జరిగిందని.. అతని వింత ప్రవర్తనతో 2016లో భార్య విడాకులిచ్చిందని గుర్తించారు. ప్రస్తుతం ఎన్టీపీసీ క్వార్టర్‌లో ఉంటూ స్వీపర్‌గా ఉద్యోగం చేసుకుంటున్నాడని పోలీసులు వెల్లడించారు.
భర్తకు తెలిసి తరచూ గొడవలు..
ఎన్టీపీసీ ధన్వంతరి ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పని చేస్తున్న మృతుని భార్య కాంపల్లి హేమలత(wife kills husband)తో రాజు వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. వీరి విషయం తెలిసిన శంకర్.. హేమలతను శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. భర్త వేధింపుల గురించి ప్రియుడితో హేమలత ఏకరువు పెట్టేది. ప్రియురాలి బాధను చూడలేక.. శంకర్‌ను ఎలాగైనా హత్య చేయాలని భావించాడు. ఇరువురూ కలిసి హత్యకు పథకం వేశారు.
బీరు బాటిల్‌తో తల పగులగొట్టి..
ఇద్దరు వేసుకున్న పథకంలో భాగంగా నిందితుడు రాజు ఆదివారం.. ఎన్టీపీసీ మార్కెట్లో రెండు పదునైన పెద్ద కత్తులను కొన్నాడు. వాటిని తన ఇంట్లో దాచి పెట్టుకొని సమయం కోసం ఎదురుచూశాడు. ఈనెల 25న రాత్రి 10:30 గంటల సమయంలో రాజుకు ఫోన్ చేసి, 'నీ వల్లనే మా మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పాడు.' ఇదే అదునుగా భావించిన రాజు తెలివిగా శంకర్‌ను తన ఇంటికి రప్పించాడు. మభ్య పెట్టి మద్యం తాగించి.. అనుకున్న పథకం ప్రకారం ఖాళీ బీరు సీసాతో శంకర్ తలపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు శంకర్(Mee Seva Employee brutal Murder case) స్పృహ కోల్పోయాడు. తన దగ్గర ఉన్న రెండు కత్తులతో విచక్షణా రహితంగా మృతుని తల, మెడపై నరికాడు. దీంతో శంకర్ అక్కడిక్కడే చనిపోయాడు.
విచక్షణా రహితంగా నరికి
డిటెక్టివ్, నా పేరు శివ సినిమాలు, ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ మాదిరిగా సాక్ష్యాధారాలను మాయం చేసి కేసు నుంచి తప్పించుకోవాలని చూశాడు. మృతుని శరీరాన్ని 7 భాగాలుగా చేశాడు. తల, రెండు చేతులు.. మల్యాలపల్లి చౌరస్తా వద్ద పడేశాడు. రెండు కాళ్లు బసంత్ నగర్ వద్ద వేశాడు. మిగిలిన భాగాలను తన ఇంట్లోనే దాచి పెట్టాడు. 26న ఉదయం హేమలతను కలిసి రాజు హత్య చేసినట్లు చెప్పాడు. ఆమె సలహా మేరకు ఇంట్లో ఉంచిన శరీర భాగాలను సప్తగిరి కాలనీలోని ఆర్టీసీ క్వార్టర్స్ సమీపంలో, ఇంకొక దాన్ని ఓసీపీలోని మేడిపల్లి శ్మశాన వాటిక సమీపంలో పడవేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. మృతుని భార్య హేమలత, రాజును అరెస్టు చేసినట్లు రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి మీడియాకు తెలిపారు.
ఇదీ చదవండి: Gas Cylinder Blast in Manthani : వంట చేస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్.. ముగ్గురికి గాయాలు