హైదరాబాద్‌లో బుధవారం కురిసిన భారీ వర్షానికి గోడ కూలి ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఎస్.ఆర్ నగర్ పరిధి శ్రీరామ్‌నగర్‌లో శివాలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కళ్యాణ్ నగర్ వద్ద బుధవారం సాయంత్రం 6.30 నిమిషాలకు... అనూష అపార్ట్‌మెంట్ గోడ కూలింది. వర్షం కారణంతో గోడ నాని ఘటన సంభవించింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. స్థానికులతో పాటు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, పోలీసులు వచ్చి పరిశీలించారు. ఎవరికి ప్రాణాపాయం జరగలేదనుకుని ఊపిరి పీల్చుకున్నారు.
కూలిన గోడ శిథిలాలను తొలగించేందుకు అపార్ట్‌మెంట్ నిర్వాహకులు గురువారం ఉదయం పదిన్నరకు క్రేన్ సిబ్బందిని పిలిపించారు. శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
''నిన్న సాయంత్రం ఆరున్నరకు గోడ కూలింది. అప్పుడు ముగ్గురికి గాయలయ్యాయి. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాము. అక్కడ ఇంకెవరు ఉన్నట్లు గుర్తించలేదు. అందుకే ఎవరూ ఇంకా దాని గురించి ఆలోచించలేదు. ఉదయం జీహెచ్ఎంసీ సిబ్బందిని పిలిపించి... శుభ్రం చేయిస్తుండగా శిథిలాల కింద ఇంకొకరు ఉన్నారని తెలిసింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాము.''
-స్థానికుడు
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మిస్సింగ్ కేసులను విచారించగా... మృతుడు ఇంజినీరింగ్ విద్యార్థి ఆశిష్‌గా గుర్తించారు.
ఇదీ చూడండి: Tragedy: కరోనా చేసిన పాపం... ముగ్గురు కుమార్తెలకు ఉరేసి తల్లి బలవన్మరణం