vikarabad si dead in accident : పెళ్లైన వారం రోజులకే వికారాబాద్ వన్‌టౌన్ ఎస్‌ఐ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఈఘటనలో ఎస్సైతో పాటు ఆయన తండ్రి కూడా మృతి చెందారు. చింతపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం మాన్యానాయక్ తండాకు చెందిన శ్రీను నాయక్ (30) వికారాబాద్ వన్ టౌన్ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీనుకు గత నెల 26న వివాహం జరిగింది. ఈ క్రమంలో ఓడిబియ్యం కార్యక్రమం ఉండడంతో తన తండ్రి మాన్యానాయక్ (55)ను తీసుకొని హైదరాబాద్ నుంచి స్వగ్రామం మాడుగుల మండలం మాన్యానాయక్ తండాకు వెళ్లారు.
అక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న అనంతరం తండ్రితో కలిసి హైదరాబాద్‌కు ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో చింతపల్లి మండలం పోలెపల్లి రాంనగర్ గ్రామ పరిధిలోకి రాగానే హైదరాబాద్ నుంచి దేవరకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీను నాయక్, అతని తండ్రి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న చింతపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన చింతపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నారు.
తండ్రిని వెనుక కూర్చోపెట్టుకుని..
2019 బ్యాచ్‌కు చెందిన శ్రీను నాయక్... అప్పటి నుంచి ట్రైనీ ఎస్సైగా చేస్తూ... 15 రోజుల క్రితమే వికారాబాద్ పట్టణ ఎస్సైగా బాధ్యతలు తీసుకున్నాడు. శ్రీను నాయక్‌కు గతేడాది డిసెంబర్ 26న చింతపల్లి మండలం కొక్కిరాలతండాకు చెందిన కొర్ర వర్ష అనే యువతితో వివాహమైంది. పెళ్లి సమయంలో కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడిపిన అతడు.. విధుల్లో చేరేందుకు తన సమీప బంధువు కారులో బయలుదేరాడు. వింజమూరి స్టేజి వద్దకు వచ్చేసరకి తన తండ్రి మాన్యనాయక్ నడుపుతున్న ఆటో ఆగి ఉండడాన్ని చూసి కారు నుంచి దిగాడు. ఏమైందని అడగ్గా తన చెయ్యి నొప్పుగా ఉందని.. ఆటో నడపలేకపోతున్నానని తండ్రి చెప్పడంతో బంధువులను వెళ్లిపొమ్మని చెప్పి.. తన తండ్రిని తీసుకుని ఆటోలో బయలుదేరాడు. పోలేపల్లి రామ్‌నగర్ స్టేజి వద్దకు వచ్చేసరికి ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు వీరి ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో తండ్రీ కుమారులిద్దరు మృతి చెందారు.
ఇదీ చూడండి: New Year Road accidents: ప్రమాదాలతో ప్రారంభమైన న్యూఇయర్.. ఓ ఎస్సై సహా 12 మంది మృతి