ఓ మహిళ స్నేహితుడితో కలిసి భర్తను హత్య చేసి ఇంటి వెనుకే పాతిపెట్టిన దారుణ ఘటన బుధవారం హైదరాబాద్ వనస్థలిపురంలో వెలుగుచూసింది. అందరినీ పక్కదారి పట్టించేందుకు అతితెలివితో ఆమె పంపిన వాట్సాప్ సందేశాలే చివరకు ఆమెకు కటకటాలపాలు చేశాయి. ఆమెకు సహకరించిన వ్యక్తి పరారీలో ఉండగా పోలీసులు అతడికోసం గాలిస్తున్నారు.
దర్యాప్తులో బయటపడిన హత్యోదంతం
బేగంబజార్‌కు చెందిన ఇంటీరియర్ డిజైనర్ గగన్ అగర్వాల్.. 2 సంవత్సరాల క్రితం కుటుంబ కలహాలతో మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. అనంతరం యాకుత్‌పురాకు చెందిన నౌషీన్ బేగంతో గగన్‌కు పరిచయం ఏర్పడింది. నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్న నౌషీన్ బేగం... అప్పటికే విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. ఇద్దరూ గతేడాది జూన్‌లో వివాహం చేసుకొని వనస్థలిపురం పీఎస్ పరిధిలోని మన్సూరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. నౌషీన్ బేగం మర్యాద అగర్వాల్‌గా పేరు మార్చుకొని... పిల్లలను తన తల్లివద్దనే ఉంచి గగన్‌తో కలిసి ఉంటోంది. ఇంతలో గత నెల 8న గగన్ అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. మేనకోడలి వివాహానికి హాజరయ్యేందుకు దోహా వెళ్తున్నట్లు గగన్ ఫోన్ నుంచి గతనెల 13న అతడి సోదరికి వాట్సాప్ సందేశం వచ్చింది. ఆ నంబరుకు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానంతో గగన్ సోదరుడు ఆకాష్ అగర్వాల్ నౌషీన్‌ను ప్రశ్నించగా.. తనకేమీ తెలియదని చెప్పింది. 18న మిస్సింగ్ కేసు నమోదు చేయగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నౌషీన్ బేగమే హత్య చేసిందని తేల్చారు.
కుమార్తెపై కన్నేశాడనే కోపంతోనే..
సాంకేతిక ఆధారాలతో కేసును దర్యాప్తు చేసిన పోలీసులు... మృతుడు గగన్ చరవాణి ఆన్‌లోనే ఉన్నట్లు గుర్తించారు. వాట్సాప్ సందేశాలు వచ్చిన నంబర్ నౌషీన్ బేగంకు తెలిసిన వ్యక్తిదేనని నిర్ధరించుకున్నారు. తమదైన శైలిలో నౌషీన్‌ను విచారించగా అసలు విషయం బయటపడింది. తానే గగన్‌ను హత్య చేసినట్లు పోలీసులకు వెల్లడించింది. తన కుమార్తెలు తరుచూ ఇంటికి వస్తుండేవారని.. ఆ సమయంలో తన భర్త గగన్ అగర్వాల్ అసభ్యంగా ప్రవర్తించేవాడని... అందుకే అదను చూసి పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులకు తెలిపింది. గగన్ స్నేహితుడు సునీల్ తరచూ ఇంటికి వస్తుండేవాడు. అతడితో నౌషీన్‌కు సాన్నిహిత్యం పెరిగింది. వారిద్దరూ కలిసి గతనెల 8న గగన్‌ను చంపి ఇంటివెనక పూడ్చిపెట్టారు. రెండు రోజుల క్రితం నౌషీన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు.
నౌషీన్‌కు కఠిన శిక్షపడేలా దర్యాప్తును వేగవంతం చేయాలని గగన్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: భర్తను హత్య చేసి కనిపించడం లేదని ఫిర్యాదు