విశాఖపట్నం జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మృతిచెందారు. పీఎం పాలెం క్రికెట్ స్టేడియం సమీపంలోని వీ కన్వెన్షన్ హాల్ ఎదురుగా మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం.. వీరి బైక్‌ను ఢీకొట్టింది. మృతులు ధనరాజ్ (22), కె.వినోద్ ఖన్నా (22)గా గుర్తించారు.
మంగళవారం రాత్రి మారికవలసలోని శారదానగర్-2 ప్రాంతానికి చెందిన ధనరాజ్, స్వతంత్ర నగర్‌కు చెందిన కె.వినోద్ ఖన్నాతో కలిసి లా కళాశాల సమీపంలోని పనోరమ హిల్స్‌లో ఉన్న స్నేహితుడు ప్రశాంత్ పుట్టినరోజు వేడుకలకి వెళ్లారు. కొద్దిసేపు అక్కడ గడిపిన తర్వాత బైక్‌లో పెట్రోల్ పోయించుకునేందుకు కొమ్మాది పెట్రోల్ బంక్‌కు వెళ్లారు. పెట్రోల్ పోయించుకున్న అనంతరం అక్కడి నుంచి తిరిగి పనోరమ హిల్స్‌కు వెళ్లేందుకు బయల్దేరారు. ఈ క్రమంలో స్టేడియం వద్దకు వచ్చేసరికి గుర్తు తెలియని వాహనం వాళ్ల బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ధనరాజ్, వినోద్ ఖన్నా అక్కడికక్కడే మృతిచెందారు. ధనరాజ్ ఇన్ఫోసిస్‌లో, వినోద్ ఖన్నా స్థానికంగానే రామాటాకీస్ వద్ద ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. పీఎం పాలెం సీఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచూడండి: Road Accident: విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం