ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య కారణాలతో ట్రాఫిక్ పోలీస్ ప్రమోద్ రెడ్డి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ప్రమోద్ రెడ్డి(33) నగరంలోని వెంకటేశ్వర కాలనీలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు.
ఆరేళ్లుగా ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడని.. ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు భార్య దుర్గాదేవి తెలిపింది. బుధవారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడగా.. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నేడు మృతి చెందారు.
20 రోజుల క్రితం ప్రమోద్ రెడ్డి తల్లి సుజాతకు కరోన పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం కొవిడ్ నుంచి కోలుకున్నారు. అప్పుల భారం అధికమవడం వల్ల తీవ్ర మనోవేదనకు గురైనట్లు భార్య పేర్కొన్నారు. మృతునికి కుమార్తెలు నిఖిత, తన్మత రెడ్డి ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: ఏనుగుల దాడిలో పంట ధ్వంసం, మహిళ మృతి