Ramagundam Coal Mine Accident: పెద్దపల్లి జిల్లా రామగుండం ఆండ్రియాల్ లాంగ్వాల్ ప్రాజెక్టులోని బొగ్గు గనిలో చిక్కుకున్న ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. రెండ్రోజుల క్రితం(మార్చి 7న) అడ్రియాల్ భూగర్భ గనిలో ప్రమాదవశాత్తు పైకప్పు కూలింది. ఇటీవల కూలిన పైకప్పును సరిచేస్తుండగా.. మరోసారి ప్రమాదం సంభవించింది. పైకప్పు కూలడంతో గనిలో ఆరుగురు కార్మికులు చిక్కుకున్నారు. ప్రమాదం జరిగిన రోజే ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
నిన్న(మార్చి 8న) సాయంత్రం.. బదిలీ వర్కర్ రవీందర్‌ను సిబ్బంది కాపాడారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తుండగా... అసిస్టెంట్ మేనేజర్ చైతన్య తేజ విగతజీవిగా కనిపించారు. శిథిలాల కింద చిక్కుకున్న మరో ఇద్దరు.. సేఫ్టీ మేనేజర్ జయరాజ్, ఒప్పంద కార్మికుడు శ్రీకాంత్ మృతి చెందారు. వారి మృతదేహాలను సిబ్బంది వెలికితీశారు. మృతదేహాలను సింగరేణి ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే..
బొగ్గుగనిలో సపోర్టుగా ఏర్పాటుచేసే పిల్లర్ తొలగించడంతో ప్రమాదం చోటుచేసుకుంది. గనుల్లో ఒత్తిడి తట్టుకునేందుకు బొగ్గు తవ్వే మార్గంలో పైకప్పునకు దన్నుగా పిల్లర్లను ఏర్పాటు చేస్తారు. అడ్రియాల గనిలో 86 నుంచి 87 లెవల్ వరకు ఉండాల్సిన మూడు పిల్లర్లలో.. మధ్యలో ఉన్నదాన్ని తొలగించారు. దీంతో పైకప్పు ఒత్తిడికి గురై 20 రోజుల క్రితం పడిపోయింది. కూలిన ప్రాంతాన్ని సరిచేసేందుకు పనులు చేపట్టిన కొద్ది గంటల్లోనే.. మళ్లీ కూలి సిబ్బందిపై పడటంతో ప్రమాదం చోటుచేసుకుంది.
సంబంధింత కథనాలు..