కుంట శ్రీనుకు వామన్‌రావుతో గ్రామంలోని పలు అంశాల్లో విభేదాలున్నాయనేది స్థానికంగా అందరికీ తెలిసిందే. ఆ కారణంతోనే అతడు వామన్‌రావు దంపతుల హత్యలకు పాల్పడి ఉంటాడని మొదట భావించారు. పోలీసులూ అదే మాట చెప్పారు. అయితే కుంట శ్రీనును విచారించాక బిట్టు శ్రీను పాత్ర బహిర్గతమైంది. హత్య సమయంలో వినియోగించిన కారుతోపాటు కత్తుల్ని సమకూర్చింది ‘'బిట్టు’' అని తేలడంతో కేసు కీలక మలుపు తిరిగింది.
సీసీ ఫుటేజీ మలుపు:
మొదట అతడు వ్యక్తిగత కక్షలతోనే దారుణానికి తెగబడ్డానని చెప్పినట్లు సమాచారం. సరిగ్గా ఇక్కడే పోలీసుల చేతికొక బలమైన అస్త్రం దొరికింది. మంథని పట్టణంలోని ఓ కూడలిలో లభించిన సీసీ కెమెరా ఫుటేజీలో కీలక ఆధారం లభించింది. బిట్టు శ్రీను నిందితుడు కుంట శ్రీనుకు నేరుగా ఆయుధాల్ని అందించిన విషయం ఆ కెమెరాల్లో రికార్డయినట్లు సమాచారం. దాన్ని చూపించడంతో అతడు బిట్టు శ్రీను పాత్ర గురించి ఒప్పుకోక తప్పలేదని తెలిసింది.
ఎవరైనా పురమాయించారా..?
వాస్తవానికి వామనరావుతో కుంట శ్రీనుకు వ్యక్తిగతంగా శత్రుత్వం ఉందే తప్ప బిట్టు శ్రీనుతో లేదనేది స్థానికంగా జరుగుతున్న ప్రచారం. అలాంటప్పుడు వామనరావును చంపించేంత అవసరం అతడికి ఎందుకొచ్చిందనేది ప్రస్తుతం నిగ్గు తేలాల్సిన అంశం. ఆ కారణాన్ని పోలీసులు కచ్చితంగా విశ్లేషించగలిగితే కేసు ఓ కొలిక్కి వస్తుంది. లేదంటే వామనరావును అంతమొందించడానికి మరెవరో బిట్టు శ్రీనును పురమాయించారనే వాదనకు బలం చేకూరినట్లవుతుంది.
ట్రస్టుకు అడ్డు పడినందుకేనా..?
పుట్ట మధు తల్లి లింగమ్మ పేరిట ఉన్న చారిటబుల్ ట్రస్ట్‌కు బిట్టు శ్రీను ఛైర్మన్‌గా ఉండేవాడు. ఈ ట్రస్టు కార్యకలాపాల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని.. ఆదాయ, వ్యయాలపై తప్పుడు లెక్కలు చూపిస్తూ నిధుల్ని మళ్లిస్తున్నారని మాజీ వార్డు సభ్యుడు ఇనుముల సతీష్ 2018లో ఆదాయపు పన్ను శాఖకు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై వామన్‌రావు సతీమణి నాగమణి ద్వారా హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనివల్ల ట్రస్టు నిర్వహణకు అడ్డంకులు ఏర్పడ్డాయి.
అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యాక మధు ట్రస్టును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీనికంతటికీ వామన్‌రావు దంపతులే కారణమనే కోపంతో బిట్టు శ్రీను ఈ జంటహత్యలకు పథక రచన చేసి ఉంటాడా? అనే అనుమానాలూ తలెత్తుతున్నాయి. అసలు కారణమేమిటన్నది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.
ఇదీ చూడండి: 'చంపేసినా అంతేనా? పోలీసులు స్పందించరా..'