హైదరాబాద్ నగర శివారు ఐడీఏ బొల్లారంలో జరిగిన వ్యక్తి హత్య (Murder Case) కేసును పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు. భార్యే భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిందని పోలీసులు నిర్ధరించారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్లు ఐడీఏ బొల్లారం పోలీసులు వెల్లడించారు. ఐడీఏ బొల్లారం పరిధిలోని వైఎస్‌ఆర్ కాలనీలో చౌహాన్ ప్రపుల్, చౌహన్ జ్యోతి దంపతులు నివాసముంటున్నారు. చౌహన్ ప్రపుల్ ఆటో నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.
ఈ క్రమంలో ప్రపుల్ భార్య అతని మిత్రుడు కృష్ణతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఎలాగైనా భర్త అడ్డుతొలగించుకోవాలని భావించిన జ్యోతి... ప్రపుల్‌ను అంతం చేశారని పోలీసులు తెలిపారు. జూన్ 8న ప్రపుల్‌ను జ్యోతి, కృష్ణలు కలిసి ఛాతీపై కొట్టడం, తలను గోడకు బలంగా కొట్టడంతో మృతి చెందినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో ఉంచి ఆటోలో సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లి గ్రామ పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో గుంత తీసి పూడ్చారని తెలిపారు. ఆ తర్వాత తన భర్త కనిపించడంలేదంటూ పోలీసులకు నిందితురాలు జ్యోతి ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి తమదైన రీతిలో విచారించగా అసలు విషయం బయటపడిందని పోలీసులు వెల్లడించారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి: CM KCR Speech: అన్ని రంగాల్లో గుణాత్మక, గణనీయ అభివృద్ధి: కేసీఆర్